BJP| ఖిలావరంగల్, మార్చి 29: ఉత్తర తెలంగాణాకే పెద్ద దిక్కైన ఎంజీఎం దవాఖానను యుద్ధప్రాతిపాదికన ప్రక్షాళన చేసి తగిన నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంజీఎంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేని తనంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి అధ్వానస్థితికి చేరిందని ఆరోపించారు. ఆస్పత్రిలో సరిపడా బెడ్లు, వీల్ చైర్లు, స్ట్రేచర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తర తెలంగాణకు పేదలకు పెద్ద దిక్కుగా, వేలాది మంది ప్రాణాలు కాపాడిన ఎంజీఎం దవాఖాన పాలకుల నిర్లక్ష్య వైఖరితో దయనీయంగా మారిందన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఖాళీలను భర్తీ చేయడం లేదని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఎంజీఎంకు ఇంచార్జి సూపరింటిండెంట్తోనే కాలం వెల్లదీస్తున్నారని, దీంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక సిబ్బంది డబ్బుల కోసం రోగులను పీక్కుతుంటున్నారన్నారు. అలాగే ఎంజీఎంలో వైద్య పరికరాలు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారని, కనీసం 2డీ, ఈసీవో పరీక్షలు కరువయ్యాయన్నారు.
సిటీ–ఎంజోగ్రామ్, ఆక్సీజన్ ప్లాంట్ యంత్రాలు వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. ఏఎంసీ, ఆర్సీయూ వార్డులో వంద పడకల చొప్పున అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎంజీఎంలో సరిపడా బెడ్లు లేకపోవడంతో ఒకే బెడ్డుపై ఇద్దరు, ముగ్గురుని పడుకోబెట్టాల్సిన దుస్థితి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. అధ్వాన్నంగా మారిన వైద్య సేవల పట్ల పేదలు పడరాని పాట్లు పడుతున్నా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేతగాని దద్దమ్మాలుగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, ఎస్సీ మోర్చా రాష్ర్ట అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్‌కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, మాచర్ల దీన్‌దయాల్, గడల కుమార్, ఎస్సీ మోర్చా రాష్ర్ట ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.