ఖిలావరంగల్, అక్టోబర్ 16 : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఈ నెల 18న జరగబోయే రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని టీఎస్ఆర్డీసీ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ పూటకో మాట మాట్లాడుతుందని విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదన్నారు.
చట్టసభల్లో బిల్లు, ఆర్డినెన్స్, జీవో అని చెబుతూ సీఎం రేవంత్‌రెడ్డి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తొలినాళ్లలోనే ఉద్యమ నాయకుడు, తొలి సీఎం కేసీఆర్ కేంద్రంలో ఓబీసీ శాఖ ఉండాలని, అలాగే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా పోరాడుతున్నదన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి సైతం పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. బీసీలపై కాంగ్రెస్, బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని శ్రీనివాస్ హెచ్చరించారు.