కాశీబుగ్గ, జూలై 21 : రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చురుగ్గా పని చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ 19వ డివిజన్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోపాటు నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు చేస్తున్న సేవలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలని సూచించారు. గత పాలకుల కన్నా కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు. రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు.
వాటి వివరాలను ప్రజలోకి తీసుకువెళ్లాలని సూచించారు. అటు విద్య ఇటు వైద్యంలో కూడా టాప్‌లో ఉన్నామని, గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. అప్పుడు వెనుకబడిన వివరాలు, ప్రస్తుతం అభివృద్ధి చేసిన వివరాలను ప్రజలకు వివరించాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో ఈ ప్రాంతాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని తెలిపారు. అయినా, ప్రతిప్రక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తునాయని అన్నారు. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సోషల్‌మీడియా వారియర్స్‌కు సూచించారు. కష్టపడిన వారికి తప్పకుండా పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని తెలిపారు.