వరంగల్ చౌరస్తా, ఆగస్టు 13: కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే ఉరితీయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ టీచింగ్ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్, ఐఎంఏ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు కేఎంసీ జూనియర్ డాక్టర్స్పాటు వైద్యులు సోమవారం రాత్రి ఐఎంఏ భవన్ నుంచి కేఎంసీ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాళీప్రసాద్ మాట్లాడుతూ ఈ ఘటనను యావత్ భారతదేశం ఖండిస్తుందన్నారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, వైద్య విద్యార్థి హత్యకు నిరసనగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం అత్యవసర సేవలు మినహా విధులకు దూరంగా ఉండనున్నట్లు వైద్యులు ప్రకటించారు. అలాగే, ఎంజీఎంహెచ్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపనున్నట్లు పేర్కొన్నారు.