వాజేడు, మార్చి 3 : గుట్టలు ఎక్కి.. వాగులు దాటి.. 16 కి.మీ గ్రామానికి నడిచి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు వైద్య సిబ్బంది. ములుగు జిల్లా వాజేడు పీహెచ్సీలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ చిన్నవెంకటేశ్వర్లు, ల్యాబ్ టెక్నీషియన్ లాకన్, గ్రామస్తుడు ధర్మయ్యను తోడుగా తీసుకొని ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. మూడు గుట్టలు ఎక్కి, మూడు వాగులు దాటి 16 కిలోమీటర్ల దూరంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న పెనుగోలు గ్రామానికి నడిచివెళ్లి అక్కడ ఇద్దరు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
అలాగే గ్రామస్తుల నుంచి రక్త నమూనాలు సేకరించి వారికి మందులను అందించారు. సాయంత్రం మండల కేంద్రానికి చేరుకున్న హెల్త్ అసిస్టెంట్ చిన్నవెంకటేశ్వర్లుతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ లాకన్ను పలువురు మండల వాసులు, వైద్యాధికారి, తోటి వైద్య సిబ్బంది అభినందించారు.