కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహాజాతర సమయం తరుముకొస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో ఉత్సవం ప్రారంభం కానుంది. ప్రభుత్వం నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ముందుకు సాగడం లేదు. అమాత్యులు డెడ్లైన్ల వరకే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీ మకాం వేసినా కీలకమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రూ. కోట్లు వెచ్చించినా భక్తులకు సౌకర్యాలు అందని ద్రాక్షగా మారాయి. పరిస్థితులు చూస్తుంటే హడావుడి చేసి.. మమ అనిపిస్తారా అనే సందేహం కలుగుతున్నది.
– ములుగు, జనవరి 26 (నమస్తే తెలంగాణ)
రేపటి నుంచి నాలుగు రోజుల పాటు మహా జాతరను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లను విడుదల చేసి భక్తుల కోసం వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులను మూడు నెలల క్రితం ప్రారంభించినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్‌తో పాటు ఎస్పీ మేడారంలోనే మకాం వేసినప్పటికీ ఇంకా పూర్తికాకపోవడంతో ముందస్తు మొక్కుల నిమిత్తం వచ్చే భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా క్యూ పనులతో పాటు విద్యుత్ పునరుద్ధరణ పనులు జాప్యమవుతుండడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతర సమయంలో భక్తులకు సులువుగా దర్శనాన్ని కల్పించేందుకు కల్యాణమండపం పక్కన విశాలమైన క్యూల నిర్మాణాన్ని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టగా, అధికారుల నిర్లక్ష్యంతో పనులు అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాల మేరకు కూలను నిర్మించకపోవడంతో లక్షలాదిగా తరలివచ్చే భక్తుల తాకిడికి అవి ఏ మేరకు తట్టుకుంటాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొనసాగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులు
మేడారం జాతరలో 24 గంటల పాటు విద్యుత్ కోతలు లేకుండా సరఫరాను అందించేందుకు ఆ శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టినప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా కోసం 196 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి 67 కిలోమీటర్ల విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంకా అక్కడక్కడా పనులు పూర్తి కాలేదు. పార్కింగ్ ప్రాంతాల్లో కూడా పూర్తి కాకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులు అవస్థలు పడుతున్నారు.
అక్కడక్కడా విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వైర్లు లాగే పనులు జరుగుతుండడంతో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా 100 శాతం మేర పనులు పూర్తి కానట్లయితే జాతర సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు చోటుచేసుకుంటాయనే ఆందోళన భక్తుల్లో వ్యక్తమవుతున్నది. జాతరకు కనీసం 3 రోజుల ముందుగానే అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి.
రూ. కోట్లు ఖర్చు చేసినా సౌకర్యాలేవి?
గత 10 జాతరల నుంచి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ భక్తులకు అనుకున్న మేర శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు అందకుండా పోతున్నాయి. మేడారం ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసిన అధికారులు కేవలం మూడు నెలల్లో గద్దెల చుట్టూ కై వారంతో పాటు ప్రాంగణాన్ని రాతి కట్టడాలతో నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కీలకమైన క్యూలతో పాటు విద్యుత్ శాఖ పనులు నత్తనడకన కొనసాగుతుండడంతో భక్తులకు ఇబ్బందులు కలిగేలా కనిపిస్తున్నాయి. భారీ యంత్రాలతో రేయింబవళ్లు పనిచేస్తున్నప్పటికీ పనులు పూర్తి కాకుండా పోయాయి. వేగవంతం చేసేందుకు రాష్ట్ర మంత్రుల బృందం 12 సార్లు హెలిక్యాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి మేడారానికి చేరుకొని పనులు పర్యవేక్షించి ఉన్నతాధికారులతో సమీక్షించి డెడ్లైన్లు విధించినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.