తాడ్వాయి, జనవరి 27 : మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. మహా జాతరకు మరో 18 రోజులు ఉన్నా ముందస్తు మొక్కులు చెల్లించేందుకు వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలను సమర్పించి, సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద పూజలు చేసి, మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవార్ల దర్శనం అనంతరం యాటపోతులను సమర్పింగి గద్దెల పరిసరాలు, చిలుకలగుట్ట, జంపన్నవాగు తదితర ప్రాంతాల్లో విడిది చేసి వంటలు చేసుకుని విందుభోజనాలు చేస్తున్నారు. జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన పలు దుకాణాలు కొనుగోళ్లతో రద్దీగా కనిపిస్తున్నాయి. గాజులు, పసుపు, కుంకుమ, బొమ్మల షాపుల వద్ద సందడి నెలకొంటున్నది.