సుబేదారి, డిసెంబర్ 2 : చారిత్రక వరంగల్‌లో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, వరంగల్‌ను మరిచిపోలేనని బదిలీపై వెళ్తున్న పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి అన్నారు. హనుమకొండలోని కమిషనరే ట్లో పోలీసు అధికారులు, సిబ్బంది శుక్రవారం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్జోషిని ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంలో ఊరేగించారు. అన్ని విభాగాల డీసీపీలు, ఏసీసీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది తాడుతో వాహనాన్ని లాగి అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం సీపీ మాట్లాడుతూ సీపీగా వరంగల్‌లో పనిచేయడం ఎప్పుడూ మరిచిపోలేనని సంతోషం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో రాణించానని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ, లాక్డౌన్ సమయంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించానని సీపీ గుర్తుచేశారు. రానున్న రోజుల్లో నూతన పోలీ సు కమిషనరేట్ భవనం పూరికావొస్తున్నదని, అధికారులు, సిబ్బందికి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మేడారం జాతరలో ట్రాఫిక్ ఇన్చార్జిగా విధులు నిర్వర్తించడం తనకు ఒక మధురస్మృతిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో డీసీపీలు వెంకటలక్ష్మి, సీతారాం, సంజీవ్, సురేశ్‌కుమార్, అడిషనల్ డీసీపీలు వైభవ్‌గైక్వాడ్, పుష్పారెడ్డి, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.