వరంగల్, మే 13 : సమన్వయంతో సీఎం కప్ పోటీల నిర్వహణను విజయవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం ఖిలావరంగల్, వరంగల్ మండలాల నిర్వహణ కమిటీ సభ్యులతో ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ సీఎం కప్ నిర్వహణలో భాగంగా అథ్లెటిక్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి ఐదు క్రీడల్లో పోటీలు ఉంటాయన్నారు. ఖిలావరంగల్ మండలానికి సంబంధించి శంభునిపేట ప్రభుత్వ కళాశాలలో, వరంగల్ మండలానికి సంబంధించి ఓసిటీ ఇండోర్ స్టేడియంలో ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
స్థానిక క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకునేలా డివిజన్ల కార్పొరేటర్లుప్రోత్సహించాలన్నారు. బల్దియా నుంచి సౌకర్యాలు, స్నాక్స్ కల్పిస్తామన్నారు. ఈ నెల 15 నుంచి 17 వరకు మండల స్థాయి, 22 నుంచి 24 వరకు జిల్లాస్థాయి, 28 నుంచి 31 వరక రాష్ట్రస్థాయి క్రీడలు ఉంటాయని మేయర్ వివరించారు. క్రీడా పోటీల విజయవంతానికి పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్య, ఆరోగ్య, మున్సిపల్, క్రీడల శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా క్రీడల అధికారి ఇందిర, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.