న్యూశాయంపేట, జనవరి 4 : గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పద్మశాలి ప్రజా ప్రతినిధులు ప్రజాసేవలో ముందుండాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. వరంగల్ జిల్లా హంటర్ రోడ్డులోని వేద బ్యాంకేట్ హాల్ విక్టరీస్ ఫెలిసిటేషన్ పేరుతో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పద్మశాలి ప్రజాప్రతినిధులను పద్మశాలి జర్నలిస్ట్ అసోసియేషన్, పద్మశాలి డాక్టర్స్, పద్మశాలి రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించిన గ్రామస్తులకు కష్టసుఖాల్లో అండగా ఉండాలన్నారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, పద్మశాలి జర్నలిస్ట్ అసోసియేషన్, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, కార్పొరేటర్ నరేందర్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు గడ్డం కేశవ మూర్తి, మెండు రవీందర్, రమణ తదితరులతో పాటు గా పద్మశాలి ప్రతినిధులు పాల్గొన్నారు.