ఏటూరునాగారం, ఆగస్టు 5 : ఏటా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యం కింద విడుదల చేసే నిధులకు స్వస్తి పలకడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు బ్రేక్ పడింది. ఈ స్కీం కింద పది అద్దె వాహనాలు నడుస్తుండగా వాటికి ఎన్హెచ్ఎం కింద బడ్జెట్ కేటాయించకపోవడంతో గత నెల నుంచి ఈ సేవలను అధికారులు నిలిపివేశారు. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, గోవిందరావుపేట, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం, కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లకు కూడా రాలేని స్థితిలో ఉన్న నిరుపేద రోగులు, గర్భిణులు, బాలింతలకు సేవలు అందించడంతో పాటు అంటు వ్యాధులను కట్టడి చేసేందుకు ఎంసీహెచ్, ఎపిడమిక్ టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.33 వేల చొప్పున అద్దె చెల్లిస్తుంటారు.
కాగా, గత నెల నుంచి నిధుల విడుదల నిలిచిపోవడంతో వాహనాలను తొలగించారు. ఇక ఆయా మండలాల్లో పనిచేస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ చూడాల్సిందిగా సూచిస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ ఏడాది ఈ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో నిలిచిపోయాయి. 2012లో ఈ స్కీంను ప్రారంభించారు. అద్దె ద్వారా వాహనాలు సమకూర్చుకొని వైద్యులు, సిబ్బందితో గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి, అంటు వ్యాధులను అరికట్టడం, గర్భిణులకు నెల వారీ పరీక్షలు చేసి, మందులు అందించడం, ప్రసవ తేదీలు నిర్ణయించి వారిని వైద్యశాలకు పంపించడం లాంటివి ప్రధానంగా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే మందులతో క్యాంపులు నిర్వహించి, చిన్న పిల్లలకు వ్యాధుల చికిత్స, టీబీ, లివర్, మలేరియా, డెంగీ, సికిల్ సెల్, ఎనీమియా, బీపీ, షుగర్, అంటు వ్యాధులు, ఆప్తాల్మిక్, గ్యాస్ట్రో, ఒంటి నొప్పులు, డయేరియాతో పాటు ఇతర వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి మందులు అందిచండంతో పాటు మెరుగైన వైద్యం పొందేందుకు సీహెచ్సీ, ఏరియా వైద్యశాలకు సిఫారసు చేసేవారు.
అలాగే, ఈ టీంల ద్వారానే గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీల్లో కూడా క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేపట్టి అవసరమైన మందులను అందించేవారు. వాహనాలు ఈ జూన్ వరకు నడిచినప్పటికీ గత నవంబర్ వరకు మాత్రమే అద్దె చెల్లించారు. ఆ తర్వాత నుంచి అద్దె బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో ప్రధానంగా సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన సమయంలో నిధులను నిలిపి, సంచార వైద్యానికి బ్రేక్ వేయడంతో ఆయా ప్రాంతాలకు చెందిన రోగులు పీహెచ్సీ, సీహెచ్సీలకు చికిత్స కోసం మప్పుతిప్పలు పడుతూ వెళుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
గత ఏడాది ఎంసీహెచ్, ఎపిడమిక్ టీంలు పది మండలాల్లోని 589 గ్రామాల్లో 2539 క్యాంపులు నిర్వహించి 1,16,184 మంది రోగులకు పరీక్షలు చేపట్టారు. ఎక్కువగా బీపీ, డయాబెటిస్ రోగులకు చికిత్స అందించారు. అంతే కాకుండా ప్రధానంగా 3732 మంది గర్భిణులు, 1573 మంది బాలింతలకు వైద్య సేవలు అందించారు. ఇలా అనేక రకాల వ్యాధులకు క్యాంపుల ద్వారా ప్రయోజనం చేకూరేది. ప్రస్తుతం వాహనాలు నిలిచిపోవడం, వైద్యులను పీహెచ్సీలకు కేటాయించడంతో శిబిరాలకు బ్రేక్ పడింది. దీంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా నెల వారీగా మందులు అందించే శిబిరాలు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఇక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో గ్రామాల్లో ఉన్న ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యశిబిరాల్లో చికిత్స పొందే అనేక మంది చిన్నచిన్న రోగాలకు కూడా ఆర్ఎంపీల వద్దకు వెళ్లాల్సి వస్తున్నది. ఇదే అదనుగా భావించి, అధిక డబ్బులు గుంజుతున్నారు. ఇక గ్రామాల్లో వీరి సేవలు తప్పనిసరి అయింది. ఇక కొంత మంది ఆర్ఎంపీలు ప్రైవేట్ వైద్యశాలలకు కమిషన్ల కోసం సిఫార్సు చేస్తున్నారు. కొందరు వచ్చిరానీ వైద్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.