దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేందుకు ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఊరూరా ఈ నెల 8నుంచి 22 వరకు ఉత్సవాల కోసం జిల్లా స్థాయిలో కమిటీలు వేసింది. చైర్మన్‌గా జిల్లా మంత్రి, కన్వీనర్‌గా కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించింది. జడ్పీ అధ్యక్షులు, మేయర్, మున్సిపల్ చైర్పర్సన్లు, ఉన్నతాధికారులు కలిపి 12 మందిని కమిటీలో సభ్యులుగా నియమించింది. ఉత్సవాల ప్రణాళిక అమలు, ఏర్పాట్లతో పాటు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేలా ఈ కమిటీలు పనిచేయనున్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగరేసేందుకు రాష్ట్ర సర్కారు 9వ తేదీ నుంచి మువ్వన్నెల పతాకాలను పంపిణీ చేయనున్నది.
వరంగల్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. అందరిలోనూ దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని మేలొలిపేలా సమున్నత స్థాయిలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన మేరకు అధికారయంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఆగస్టు 8 నుంచి 22 వరకు పల్లె, పట్నంలో తేడా లేకుండా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం రాష్ట్ర సర్కారు జిల్లా స్థాయిలో కమిటీలు వేసింది. ‘జిల్లా స్వతంత్ర భారత వజ్రోత్సవ కమిటీ’ పేరిట పిలిచే ఈ కమిటీకి చైర్మన్‌గా జిల్లా మంత్రి, కన్వీనర్‌గా కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్, మేయర్, మున్సిపల్ చైర్పర్సన్లు, జిల్లా ఉన్నతాధికారులు కలిపి కమిటీలో 12 మంది సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఉత్సవాల నిర్వహణ ప్రణాళిక అమలు, ఏర్పాట్లను ఈ కమిటీ చూసుకుంటుంది. వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువత ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకునేలా కమిటీలు చర్యలు చేపడుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇంటింటికీ జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించగా ఈ మేరకు కమిటీ ఏర్పాట్లు చేస్తున్నది. ‘ప్రతి ఇంటిపై జాతీయ జెండా.. ప్రతి గుండెలో భారతీయత’ నినాదంతో ఆగస్టు 9 నుంచే జాతీయ పతాకాలను పంపిణీ చేయనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీ ఆధ్వర్యంలో ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగనున్నది.
స్థానిక సంస్థల బాధ్యులు, ప్రజలతో కలిసి ఉత్సవాలను విజయవంతం చేసేలా జిల్లాల కమిటీలు చర్యలు చేపడుతున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, స్టార్ హోటల్లు, దవాఖానలు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ, చారిత్రక భవనాలు, ముఖ్యమైన కూడళ్లను పదిహేను రోజులపాటు ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో వకృ్తత్వ, వ్యాస రచన, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లకు దేశభక్తిపై కవితారచన పోటీలు ఉంటాయి. గ్రామ, మండల, జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం కప్ పేరుతో ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ్రప్రదానం చేస్తారు. వన మహోత్సవం పేరిట మొకలు నాటుతారు. ఫ్రీడం పారులు ఏర్పాటు చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రేటర్ వరంగల్ కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. జిల్లాల్లో ఉత్తమ పంచాయతీ, మున్సిపాలిటీ, పాఠశాల, ఉత్తమ రైతు, డాక్టర్, ఇంజినీరు, పోలీస్ అధికారి, కళాకారుడు, గాయకుడు, కవిని గుర్తించి సత్కరించనున్నారు.