హనుమకొండ, అక్టోబర్ 11 : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లలో భారీ మోసం జరిగిందని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సీ శశిధర్‌రాజు వెల్లడించారు. అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కుట్ర చేసి, నకిలీ రైతులను సృష్టించి ప్రభుత్వ నిధులను పకదారి పట్టించారని తెలిపారు. శనివారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓఎస్డీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ సైదులుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్కాగా తెలిసిన సమాచారం మేరకు.. 2024-25 రబీ సీజన్లో శాయంపేట మండలం శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విచారణలో తేలిందన్నారు.
కమలాపుర్ సాంబశివ మినీ మోడ్రన్ రైస్‌మిల్లు యజమాని బెజ్జంకి శ్రీనివాస్ ఈ అవినీతికి సూత్రధారుడని దర్యాప్తులో తేలిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో శ్రీనివాస్ కుమ్మక్కై అధికారిక ఆన్లైన్ ధాన్యం సేకరణ నిర్వహణ వ్యవస్థ(ఓపీఎంఎస్) పోర్టల్ ద్వారా 12 మంది నకిలీ రైతులు(తన కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు) వివరాలను నమోదు చేసి అవినీతికి పాల్పడ్డాడని వివరించారు. నకిలీ రైతుల పేరుతో 278 ఎకరాలు సాగు చేసినట్లుగా చూపి రూ.1,84,63,088 విలువ చేసే 8,049.6 క్వింటాళ్ల ధాన్యం సేకరించకుండా, రవాణా చేయకుండానే సేకరించినట్లు చూపి మిల్లరు బెజ్జంకి శ్రీనివాస్ అవినీతికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ మొత్తాన్ని అక్రమంగా క్లెయిమ్ చేసి 12 మంది నకిలీ రైతుల అకౌంట్ల ఖాతాలకు బదిలీ చేశారన్నారు.
వ్యవసాయ శాఖ ఏవో గంగ జమున, ఏఈవోలు బీ అర్చన, ఎం సుప్రియ వారి లాగిన్ ఐడీలను శాయంపేట ఐకేపీ ఇన్చార్జి బీ హైమావతి, కాంట్రపల్లి ఐకేపీ ఇన్చార్జి అనితకు అప్పగించగా.., బండ లలిత, వాంకుడోత్ చరణ్, రవాణా కాంట్రాక్టర్ సుధారాణి రాజేశ్వర్‌రావు సహకారంతో బెజ్జంకి శ్రీనివాస్ అవినీతికి పాల్పడట్టు విచారణలో తేలిందని శశిధర్‌రాజు పేర్కొన్నారు. అయితే రవాణా కాంట్రాక్టర్ సుధారాణి రాజేశ్వర్‌రావు శాయంపేట ఐకేపీ కేంద్రంలో 24, కాంట్రపల్లి ఐకేపీ కేంద్రంలో మూడు కలిపి మొత్తం 27 ట్రక్ షీట్స్ ద్వారా ధాన్యం రవాణా చేసినట్లు ( ధాన్యం భౌతికంగా రవాణా చేకుండా) క్లెయిమ్ చేశారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి రవాణా చేసినట్లు నకిలీ లారీ చిట్టీలు, టోకెన్ పుస్తకాలు స్పష్టించి రికార్డులను తారుమారు చేసి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు రవాణా చేసినట్లు చూపడంతో సివిల్ సప్లయ్ కార్పొషన్ నుంచి మోసపూరిత చెల్లింపులకు దారి తీసిందని వివరించారు.
అక్రమంగా క్లెయిమ్ చేసిన రూ.1.86 కోట్లకు పైగా నిధులు, రవాణా చార్జీలను తక్షణమే రికవరీ చేయాలని, తదుపరి బోనస్ చెల్లింపులు చేయరాదని సివిల్ సప్లయి కార్పొరేష్‌కు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మోసంలో భాగస్వాములైన రైస్ మిల్లర్, వ్యవసాయ శాఖ అధికారులు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, రవాణా కాంట్రాక్టర్, నకిలీ రైతులపై శాయంపేట పోలీస్ స్టేషన్లో హనుమకొండ జిల్లా సివిల్ సప్లయి కార్పొరేషన్ డీఎం ఫిర్యాదు చేశారని తెలిపారు. ధాన్యం ప్రొక్యూర్మెంట్ విషయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తప్పవని శశిధర్ రాజు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
శాయంపేట : 2024-25 రబీ సీజన్లో ఐకేపీ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు శనివారం ఫిర్యాదు చేయగా, అక్రమాలకు పాల్పడిన 21 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్ వెల్లడించారు. శాయంపేట, కాట్రపల్లి కేంద్రాల్లో యాసంగిలో ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలో రూ.1.86 కోట్లు అవినీతి జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు.
కమలాపూర్‌కు చెందిన సాంబశివ మినీ మోడ్రన్ రైస్‌మిల్ యజమాని బెజ్జంకి శ్రీనివాస్‌పై ఏ1 కేసు, బండ లలిత,వాంకుడోత్ చరణ్, హైమావతి, అనిత, గంగా జమున, అ ర్చన, సుప్రియ, రాజేశ్వర్‌రావు, వడ్లూరి నవత, కల్యాణ్, శ్రీచరణ్, బెజ్జంకి శోభారాణి, శివకుమార్, చందు, వడ్లూరి రాజేందర్, బెజ్జంకి పూ నమ్చారి, వేమునూరి శ్రీనవ్య, శ్రీనివాసాచారి, ఉదయలక్ష్మి, చిర్లనేహ సిందు తదితరులపై కేసు నమోదైనట్లు చెప్పారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, నకిలీ రైతులు, ఐకేపీ నిర్వాహకు లు, ఇతరులు భాగస్వాములైనట్లు తెలిపారు. వీరందరిపై బీఎన్ఎస్ సెక్షన్ 318 ప్రకారం చీటింగ్ కేసు నమోదైందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని చెప్పారు.