ఏటూరునాగారం, డిసెంబర్ 1 : అటు పీఎల్జీఏ వారోత్సవాలు, ఇటు ప్రజా పాలన విజయోత్సవాల నేపథ్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ ములుగు ఏజెన్సీలో అలజడి సృష్టించింది. సుమారు 15 ఏండ్లకుపైగా నిశబ్ధంగా ఉన్న ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో జరిగిన హోరాహోరీ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందా రు.
భారీగా ఆయుధాలు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐలాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టులు చింతగూడెం వద్ద ఆర్టీసీ బస్సును పేల్చి వేశారు. ఆదివారం తెల్లవారు జామున మండలంలోని చెల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన భీకర పోరులో ప్రశాంతంగా ఉన్న పచ్చని అడవి ఎరుపెక్కింది. మావోయిస్టులు గత కొంతకాలంగా ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారనే సమాచారం మేరకు గొత్తికోయగూడేలపై పోలీసులు నిఘా వేశారు.
గత నెల 21న రాత్రి వాజేడు మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేశ్, ఉయిక అర్జున్ను ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేసి పోలీసులకు సవాల్ విసిరారు. ఇది కాస్త మండల కేంద్రంలోనే జరగడంతో పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఈ నెల 2 నుంచి మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇక ప్రభుత్వం కూడా ప్రజా పాలన విజయోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టింది.
వారోత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే భారీ ఎన్కౌంటర్ జరగడంతో ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో అలజడి చెలరేగింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనం భయాందోళన చెందుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా దళ కమాండర్ కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35), డివిజన్ కమిటీ సభ్యుడు ఎగలోపు మల్లయ్య అలియాస్ మధు (43), ఏరియా కమిటీ సభ్యుడు ముసకి దేవ ల్ అలియాస్ కరుణాకర్ (22) మృతిచెందినట్లు గుర్తించామని ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు.
మరో ముగ్గురిని గుర్తించాల్సి ఉందన్నారు. మృతు ల్లో ఒకరైన భద్రుపై ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. మృతుల్లో ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కాగా, ఎగలోపు మల్లయ్య అలియాస్ మధు పెద్దపల్లి జిల్లాకు చెందినవాడుగా తెలుస్తున్నది. పక్కా సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తున్నది. శనివా రం రాత్రి రెండు లారీల్లో పోలీసులు చెల్పాక వచ్చినట్లు సమాచారం. ఒక్కసారిగా మావోయిస్టుల డెన్ పై కాల్పులు జరపడంతో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అర కిలోమీటర్ వరకు పడిఉన్న మృతదేహాలను చూస్తే తెలుస్తున్నది.