కాశీబుగ్గ, మార్చి 30 : రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం 14వ డివిజన్లోని వంద ఫీట్ల రోడ్డులో గల ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే విలీన గ్రామాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
అందులో భాగంగా ఏనుమాముల, కారల్‌మార్క్స్‌కాలనీ, రెడ్డిపాలెం, ఇందిరమ్మకాలనీ, ఎస్ఆర్ నగర్, బాలాజీనగర్, సుందరయ్యనగర్, ఎన్టీఆర్ నగర్, ఐలమ్మ నగర్, మణికంఠ కాలనీ, సాయిగణేశ్ కాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, మధురానగర్ కాలనీల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తట్టెడు మట్టి కుడా పోయలేదన్నారు. అన్ని కుల, మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు తీసుకొస్తే ఇప్పటి వరకు వాటిని పూర్తి చేయలేదన్నారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏనుమాముల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
కాగా, డివిజన్లోని పలు పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు అరూరి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో నాయకులు ముడుసు నరసింహ, కేతిరి రాజశేఖర్, గండ్రాతి భాస్కర్, రాజపోశాలు, సుభాష్, పసులాది మల్లయ్య, కొత్తపెల్లి యాదగిరి, భూక్యా శంకర్, సలీం, మాధవి, సమ్మక్క, పస్తం యాదగిరి, పస్తం నర్సింగం, హైమావతి, వీరాచారి, కల్యాణ్, శ్రీనివాస్, వనజ, లక్ష్మి, నవీన్, కుమారస్వామి, సాంబయ్య, రాజు, అశోక్, అఫ్జల్, జంగం రాజు తదితరులు పాల్గొన్నారు.