హనుమకొండ రస్తా, జులై 29 : ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంలో వెలుగులోకి వచ్చిన ఘటన యావత్ భారత దేశ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఘటనపై న్యాయవిచారణ చేపట్టి హంతకులను, సంబంధిత గుడి పెద్దలైనా నేరస్తులకు సరైన శిక్షి విధించాలని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీలో పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో అక్కడ స్వచ్ఛతా (పారిశుద్ధ్య) కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి 1995 నుంచి 2014 మధ్య అనేక మంది మహిళలు, చిన్నారుల మృతదేహాలు అక్కడ బలవంతంగా ఖననం చేయబడ్డాయని, ఆ దారుణాలు చూడలేక తను అక్కడ నుంచి పారిపోయి దూరంగా ఉన్నానని అయన తిరిగి వచ్చి జులై 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దారుణ ఘటనలో 100 నుంచి 300 మందిపైగా హత్యకు గురయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.
ఇన్ని నేరాలు జరిగిన క్రమంలో స్థానిక పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు పసిగట్టలేకపోయారని, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విచారణ స్వతంత్రంగా జరగాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతమైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో అన్ని కోణాలనూ పరిశీలిస్తూ, బాధితులకు న్యాయం జరగేలా చర్యలు తీసుకోవాలని, ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించి, బాధితుల గుర్తింపు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి పవన్, నాయకులు ప్రశాంత్, సాయి, గణేష్, రాజేష్ పాల్గొన్నారు.