సుబేదారి, ఏప్రిల్ 21 : మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యుడి హోదాలో కేంద్ర కమిటీ టెక్నికల్ టీం సభ్యుడిగా పనిచేస్తున్న మూల దేవేందర్‌రెడ్డి అలియాస్ మాధవ్‌తో పాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 వేల నగదు, విప్లవ సాహిత్యం, పెన్‌డ్రైవ్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరిని శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఏవీ రంగనాథ్ మీడియా సమావేశంలో అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెలుక గ్రామానికి చెందిన మూల దేవేందర్‌రెడ్డి అలియాస్ మాధవ్ అలియాస్ కరప స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకొని.. 1978లో అప్పటి పీపుల్స్‌వాల్ రాడికల్ విభాగం సిటీ ఆర్గనైజర్ పోరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగాలు, పీపుల్స్‌వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. కొంతకాలం సానుభూతిపరుడిగా పనిచేసి సీవో వెంకటరెడ్డి ప్రోత్సాహంతో 1982లో సిర్పూర్ దళ సభ్యుడిగా చేరాడు. ఆ సమయంలో ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న సిర్పూర్ దళ కమాండర్‌గా వ్యవహరించారు.
మూడేళ్ల పాటు సిర్పూర్ దళంలో పనిచేసిన దేవేందర్‌రెడ్డి పలు విధ్వంసకర, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అనంతరం 1985లో అప్పటి డీసీఎం కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ఉత్తర్వుల మేరకు దేవేందరెడ్డిని అహేరి దళానికి బదిలీ చేశారు. 1987లో దళ సభ్యురాలు ఆత్రం బయ్యక అలియాస్ జ్యోతిని వివాహం చేసుకున్నాడు. 1994లో పీపుల్స్‌వార్, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జ్యోతి మరణించింది. 1995లో మాడ్ ఏరియా కిసోడా దళ కమాండర్‌గా పనిచేసే సమయంలో దేవేందర్‌రెడ్డికి సెంట్రల్ టెక్నికల్ కమిటీ సభ్యుడైన రమణతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో పా ర్టీ నాయకత్వం 1996 సంవత్సరంలో దేవేందరెడ్డి డీసీఎం సభ్యుడి హోదాలో దండకారణ్య ప్రాంతంలో టెక్నికల్ డిపార్ట్మెంట్ కమాండర్‌గా పనిచేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ కమాండర్‌గా పనిచేసిన సమయంలో దేవేందర్‌రెడ్డి సూ మారు 850కి పైగా తుపాకులను తయారు చేసి మావోయిస్ట్ పార్టీకి అందజేశాడు. ఇదే సంవత్సరంలో మహిళా దళ సభ్యురాలైన దేవియా హుస్సేండి అలియాస్ రూపిని దేవేందర్‌రెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. 2007లో దేవేందర్‌రెడ్డి, తన భార్య, మరికొద్దిమంది దండకారణ్య కమిటీ సభ్యులతో కలిసి తయారుచేసిన తుపాకులను చర్ల మీదుగా దండకారణ్యానికి వెళ్తుండగా, పోలీసులకు పట్టుబడ్డాడు. 2009లో వరంగల్ జైలు నుంచి విడుదల అనంతరం దేవేందర్‌రెడ్డి తన భార్య రూపితో కలిసి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2010లో సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు 12 బోర్, పాయింట్ 303 తుపాకులను తయారుచేసి పార్టీకి అందజేశాడు.
సౌత్, వెస్ట్ బస్తర్ ప్రాంతాలకు 2017 వరకు బాధ్యులుగా పనిచేసిన సమయంలో దేవేందర్‌రెడ్డి వివిధ రకాల తుపాకులు, మందుపాతరలు, రాకెట్ లాంచర్లు తయారు చేసి దళాలకు అందించడంలో కీలకంగా పనిచేశారు. ఇతడిని పార్టీ అధిష్టానం దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా నియమించింది. ఇప్పటివరకు దేవేందర్‌రెడ్డి ప్రస్తుతం కేంద్ర విభాగానికి చెందిన సభ్యులతో పాటు దండకారణ్య, నార్టను చెందిన కీలక మావోయిస్టు నాయకులతో పనిచేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు 33కి పైగా నేరాలు చేశాడు. ఇందులో ప్రధానంగా 2010లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, హిడ్మా మరో 300 మంది మావోయిస్టులతో కలిసి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లా చింతగుప్ప పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడిమెట్ల అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న సీఆర్పీఎఫ్ పోలీసు బృందాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిగి 75 మంది సీఆర్పీఎఫ్ పోలీసులను హత్య చేసి వారి తుపాకులను ఎత్తుకెళ్లిన ఘటనలో కీలక నిందితుడు. అలాగే ఎంతోమంది సీఆర్పీఎఫ్ పోలీసులు, ఇన్ఫార్మర్ నెపంతో సాధారణ పౌరులను హత్య చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంలో నేరస్థుడు. దేవేందర్‌రెడ్డిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కొద్దికాలంగా దేవేందర్‌రెడ్డికి కంటిచూపు సమస్య రావడంతో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో దేవేందర్‌రెడ్డి సానుభూతిపరుడు తిరుపతిరెడ్డితో సహా సుబేదారి బస్‌స్టాప్ వద్ద పోలీసులకు చికారు.
లొంగిపోండి పునరావాసం కల్పిస్తాం : సీపీ రంగనాథ్
మావోయిస్టులు మొండితనంతో సాధించేదేమీ లేదు. ఆత్మపరిశీలన చేసుకొని లొంగిపోతే రాష్ట్ర ప్రభుత్వం తరపున పునరావసం కల్పిస్తాం.. ఇప్పుడు మావోయిస్టు పార్టీ అచేతనంలో ఉంది. కేంద్ర కమిటీలో మొత్తం 22 మందిలో 15మంది తెలంగాణవారే ఉన్నారు. వీరిలో 70 ఏళ్లు, 60 ఏళ్లు దాటిన వారు ఉన్నారు. ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు 75 ఏళ్లు ఉన్నారు. గణేశ్ 58లోపు ఉన్నారు. నడువలేని స్థితిలో ఉన్నారు. కొవిడ్ సమయంలో హరిభూషణ్‌తో పాటు చాలామంది చనిపోయారు. తెలంగాణ నుంచి రిక్రూట్ అనేది లేదు, ఛత్తీస్‌గఢ్ నుంచి మైనర్ పిల్లలను పార్టీలో చే ర్చుకుంటున్నారు. తెలంగాణలో మావోయిస్ట్పార్టీ లేకుండా పోయిందని సీపీ చెప్పారు.