మట్టెవాడ, సెప్టెంబర్ 6: నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో ప్రధాన సూత్రధారి మన్యం సిద్ధయ్యను మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ప్రధాన సూత్రధారి అయిన మన్యం సిద్ధయ్య తప్పించుకు తిరుగుతుండగా పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మట్టెవాడ ఎస్సై రవీందర్ వివరాలు వెల్లడించారు. వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ అధికారులతో సిద్ధయ్య చనువుగా ఉండేవాడు.
ఈ క్రమంలో మరో నిందితుడు గోవింద సతీశ్‌కుమార్‌తో కలిసి సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఆఫీసుకు వచ్చే వారికి నకిలీవి ఇచ్చి డబ్బులు పంచుకునేవారు. మండిబజార్‌కు చెందిన ఖాజా, మహ్మద్ అజారుద్దీన్, కాజీపేటకు చెందిన సయ్యద్ సాబీర్, ఫసియుద్దీన్ ఖాద్రీ, చుకల సునీత, మాకుల దామోదర్ ఫ్యామిలీ మెంబర్స్‌కు సర్టిఫికెట్లతోపాటు ఎనుమాములకు చెందిన పస్తం సతీశ్‌కు మనీ ల్యాండింగ్‌కు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇటీవల పస్తం సతీశ్ మనీ ల్యాండింగ్ సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేయాలని దరఖాస్తు చేసుకోగా పరిశీలించిన తహసీల్దార్ ఇక్బాల్ సర్టిఫికెట్లు నకిలీవని గుర్తించి మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గిర్మాజీపేట, సెప్టెంబర్ 6: తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని రైతులు శుక్రవారం వరంగల్ జేపీఎన్ రోడ్‌లోని కెనరా బ్యాంకు ఎదుట పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ రూ. 2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.