పల్లెల వికాసమే దేశ సమగ్రాభివృద్ధికి పునాది అని బలంగా నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. అధిక నిధులు కేటాయిస్తూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఫలితంగా పలు పంచాయతీలు ఇప్పటికే జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నాయి. సర్కారు పోత్సాహంతో స్వచ్ఛ సర్వేక్షణ్-2023 అవార్డుల రేసులో మరికొన్ని పల్లెలు నిలిచాయి. మూడు కేటగిరీలుగా జీపీలను విభజించిన అధికారులు ఉత్తమ గ్రామాల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఐదు అంశాల్లో పరిశీలన అనంతరం మండలానికి 15 పంచాయతీల చొప్పున సెలెక్ట్ చేసి జిల్లాకు, అటు నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. స్టేట్ లెవల్లో ఎంపికైన జీపీలు జాతీయ స్థాయి పోటీల్లో నిలువనున్నాయి.
– హనుమకొండ, మే 22
హనుమకొండ, మే 22 : తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్- 2023 అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. అధికారులు అవార్డు సాధించడమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని జీపీలను మూడు కేటగిరీలుగా విభజించి ఐదు అంశాలపై పరిశీలిస్తున్నారు. ప్రతి మండలం నుంచి 15 పంచాయతీలను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి ఉత్తమ పంచాయతీలను గుర్తించి రాష్ట్ర స్థాయికి, అక్కడి నుచి జాతీయ స్థాయి పంపిస్తారు. కేంద్ర బృందం పరిశీలన తర్వాత గ్రామాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందించనున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయి బృందాలు ఈ నెల ఒకటో తేదీ నుంచి సర్వే ప్రారంభించాయి.
మూడు కేటగిరీలుగా జీపీలు..
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 అవార్డు కోసం జిల్లాలోని గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన మూడు విభాగాలుగా విభజించారు. ఐఎంఐఎస్ డాటా ఆధారంగా 2 వేల లోపు, 2 వేల నుంచి 5వేలు, 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలుగా విభజించినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు. మండల స్థాయిలో ఒక్కో కేటగిరీ నుంచి 5 చొప్పున మొత్తం 15 పంచాయతీలను ఎంపిక చేస్తారు. 12 మండలాల పరిధిలో మొత్తం 180 పంచాయతీల్లో ప్రభుత్వం సూచించిన ఐదు అంశాల్లో సర్వే చేసి జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. ఎంపిక బాధ్యతను ఎంపీడీవో, ఎంపీవో ఆధ్వర్యంలో నియమించిన మండల స్థాయి బృందాలకు అప్పగించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు సర్వే ప్రక్రియను పూర్తి చేసి జిల్లాకు పంపిస్తారు. జూన్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలో పరిశీలించి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. జూలై ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి జాతీయ స్థాయి పంపిస్తారు. జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు జాతీయ స్థాయిలో సర్వే పూర్తి చేసి అవార్డులు ఇస్తారని అధికారులు తెలిపారు.
ఐదు విభాగాల్లో సర్వే..
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డు కోసం ప్రభుత్వం సూచించిన ఐదు విభాగాల్లో అధికారులు సర్వే ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలో సర్వేను గ్రామాలలో ఘన వ్యర్థాల నిర్వహణ (ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ), గ్రే వాటర్ మేనేజ్మెంట్ (మురుగు నీటి నిర్వహణ), మల సంబంధ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో దృశ్య పరిశుభ్రత, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాల్లో సర్వే ప్రారంభమైంది. మూడు విభాగాలుగా విభజించిన గ్రామాల్లో మండల స్థాయి బృందాలు ఐదు అంశాల్లో ముఖ్యంగా వ్యక్తిగత, కమ్యూనిటీ సోప్ ఫిట్స్, కిచెన్ గార్డెన్స్, డ్రైనేజీ అండ్ సోప్ పిట్స్, సెప్టిక్ ట్యాంక్, నీరు నిల్వకుండా, చెత్త లేకుండా ఉండడం, వాల్ పెయింటింగ్, ప్లాస్టిక్ వినియోగం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొంటారని అధికారులు తెలిపారు.
ఇప్పటికే సర్వే ప్రారంభించాం..
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 అవార్డు కోసం జిల్లాలో సర్వే ప్రక్రియను ప్రారంభించాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 12 మండలాల పరిధిలోని 208 గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన మూడు విభాగాలుగా విభజించి, ఐదు అంశాలను ప్రామాణికంగా తీసుకొని సర్వే చేస్తున్నాం. జూన్ 15వ తేదీలోగా మండల స్థాయిలో పూర్తి చేసి, 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలో సర్వే పూర్తి చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తాం.
– ఏ శ్రీనివాస్‌కుమార్, డీఆర్డీవో హనుమకొండ జిల్లా