మహబూబాబాద్ రూరల్, జనవరి 8 : అన్నం పెడతామని పిలిచి ఓ దుండగుడు సదరు వ్యక్తి ఇంటిని దోచేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో చోటు చేసుకోగా, 24 గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందు కు సంబంధించిన వివరాలను టౌన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. నర్సింహులపేటకు చెందిన ఏరనాగ సీతారాములుకు ఇద్దరు కుమారులుండగా, పెద్దవాడు అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు.
చిన్న కొడుకు, కోడలు మహబూబాబాద్‌లోని ఏకలవ్య మోడల్ స్కూల్లో విధులు నిర్వర్తిస్తూ రోజు వెళ్లి వస్తుంటారు. కాగా, సీతారాములు బంగారం, వెండి కుదువబెట్టుకొని అవసరమున్న వారికి వడ్డీకి అప్పులిస్తుంటాడు. ఆయన ఇంటి పక్క నే కోటగిరి రవి కుటుంబం ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం సీతారాములు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాము చేపల కూర వండామని, అన్నం తిని వెళ్లమంటూ రవి పిలిచాడు. ఈ క్రమంలో రవి భార్య భోజనం వడ్డిస్తుండగానే ఇదే అదునుగా భావించిన రవి సీతారాములు ఇంట్లో కి వెళ్లి బీరువా తాళం పగుల కొట్టి అందులో ఉన్న బంగా రం, వెండి, నగదును దోచుకెళ్లాడు. సాయంత్రం కుమారుడు వచ్చి దొంగతనం జరిగినట్లు గుర్తించి ఇంటి పక్కనున్న రవిపైనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీం తో రవిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా చేసి న అప్పులు తీర్చేందుకు, జల్సాగా జీవించేందుకు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. మొత్తం సొమ్మును పొలం వద్ద దాచిపెట్టినట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి బంగారం, వెండి నగలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 26.50 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ సీఐ హతీరామ్, ఎస్సైలు తాహెర్ బాబా, గోపి, సిబ్బందిని ఆయన అభినందించారు.