నర్సంపేట, జూలై 24: మణిపూర్‌లో నరమేధం సృష్టిస్తున్న వారి ఆగడాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని స్వచ్ఛంద సేవా సంస్థల సమాఖ్య ప్రతినిధి, ప్రజ్ఞ కళాశాల డైరెక్టర్ పిట్టల సురేందర్ పిలుపునిచ్చారు. మణిపూర్ ఘటనను నిరసిస్తూ నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం ధర్నాను నిర్వహించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు గిరగాని సుదర్శన్‌గౌడ్, బెజ్జంకి ప్రభాకర్, బోయిని వెంకటస్వామి, నాగెల్లి సారంగంగౌడ్, వేల్పుల శ్రీలత, ఆబోత్ రాజు, కాసుల వెంకటాచారి, ఎర్రబోయిన రాజశేఖర్, కోట డేవిడ్, కాసుల రవికుమార్, గట్టు ఆనంద్, మొగిలిచర్ల రాము, ఆచార్య కళాశాల ప్రిన్సిపాల్ జీజుల సాగర్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
దుగ్గొండి(నర్సంపేట)/నెక్కొండ: మణిపూర్ ఘటనను తీవ్రంగా ఖండించాలని రైతుకూలి సంఘం నాయకులు మోడం శ్రీలత, అశోక్ పిలుపునిచ్చారు. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లకు కేంద్రంలోని బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ దుగ్గొండి మండలం తిమ్మంపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మణిపూర్‌లోని కాంగ్ఫోక్సి జిల్లాలో కూకి తెగకు చెందిన ఇద్దరు ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కూనూర్ సతీశ్, స్వప్న, రాధిక, సుజాత, స్వామి, సుదర్శన్ పాల్గొన్నారు. అలాగే, నెక్కొండలోని అంబేద్కర్ యువజన సంఘం భవనంలో దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాంకాల యాదగిరి మాట్లాడుతూ కేంద్రం మణిపూర్ ఘటనపై దృష్టి సారించి కేంద్ర బలగాలను మోహరించి దాడులు, దౌర్జన్యాలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుండగులను గుర్తించి అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు మాదారపు మాణిక్యం, ఎమ్మార్పీఎస్ టీఎస్ డివిజన్ ఇన్చార్జి వడ్డూరి కుమారస్వామి, మైదం రాజు పాల్గొన్నారు.
బీజేపీ ప్లాన్ ప్రకారణమే హింసాకాండ
ఖిలావరంగల్: మణిపూర్‌లో బీజేపీ, బీరెన్ సింగ్ ప్రభుత్వాలు కుట్రపూరితంగానే హత్యలు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నాయని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే గోవర్ధన్ ఆరోపించారు. ఖిలావరంగల్ పెట్రోల్ పంపు ఏరియాలో ప్రజాసంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా మణిపూర్‌లో హింసాకాండ చేసేందుకు ప్లాన్ ప్రకారం ఇంటర్నెట్ సేవలను బంద్ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాగా, కూకి ప్రజల ఊచకోతకు పాల్పడుతున్నాయని విమర్శించారు. సమావేశంలో ఆరెళ్లి కృష్ణ, బండి కోటేశ్వర్రావు, రాచర్ల బాలరాజు, ఎలకంటి రాజేందర్, విజయ పాల్గొన్నారు.