భీమదేవరపల్లి, జులై 15 : ధర్మసాగర్ నార్త్ కెనాల్ ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మండల సురేందర్ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా చింతగట్టు క్యాంపు కార్యాలయంలో రైతులతో కలిసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పొలాల్లో నార్లు పోసుకొని నెల రోజులు గడుస్తున్నా దేవాదుల నీళ్లు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటి లభ్యత లేకపోవడంతో నార్లు ఎండి ముదిరి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సమయానికి నీళ్లు వదిలే వారిని, రైతులు రోడ్డెక్కిన దాఖలాలు ఎప్పుడూ లేవన్నారు. దేవాదుల నార్త్ కెనాల్ నుండి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గద్ద కుమారస్వామి, కొండూరి పరమేశ్వర్, నేతుల కొమురయ్య, పెట్టం కుమార్ తదితరులు పాల్గొన్నారు.