కన్నాయిగూడెం/ఏటూరునాగారం, జనవరి 23 : ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రజాపాలన గ్రామసభ జరుగుతుండగానే అధికారుల సాక్షిగా పురుగుల మందు తాగి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో అధికారులు అర్హుల జాబితాను చదివి వినిపించారు.
దీంతో కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు (నాగయ్య) అనే దళితుడు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదని అధికారులను నిలదీశాడు. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాల్లో అర్హులు కాకుండా అనర్హుల పేర్లు వచ్చాయని, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎలా వస్తాయని ప్రశ్నించాడు. గత ఏడాది తన ఇల్లు కాలిపోయిందని ఫొటోలను అధికారులకు చూపెడుతూనే ‘నాకు రాకపోయినా నా చావుతోనైనా గ్రామంలోని అర్హులకు పథకాలు ఇవ్వాలి’ అని అధికారులకు చెప్పి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు మందు డబ్బాను లాక్కోగా, అక్కడే ఉన్న తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో వనిత వాసనకు ముక్కు మూసుకొని పక్కవెళ్లిపోయారు. అక్కడే ఉన్న ఇతర అధికారులు, గ్రామస్తులు నాగయ్యను అంబులెన్సులో ఏటూరునాగారం సీఎచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు.
కాంగ్రెస్ నాయకుల బెదిరింపులతోనే.. : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి
ప్రభుత్వ పథకాలు పేదలకు అందడం లేదని, తన పేరు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు గ్రామసభలో బెదిరించడంతోనే మనస్తాపానికి గురైన నాగేశ్వర్రావు పురుగుల మందు తాగాడని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నర్సింహారావు ఆరోపించారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయ కక్షతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దన్నారు. నిరుపేదలకు పథకాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
ప్రజలు తిరగబడుతున్నరు
ములుగు మాజీ జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి
ములుగు, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ములుగు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు ప్రభుత్వంతో పాటు అధికారులపై తిరగబడుతున్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ తీరుతోనే కుమ్మరి నాగేశ్వర్రావు ఆత్మహత్యకు యత్నించాడని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో గతంలో స్వీకరించిన దరఖాస్తులను పక్కనపెట్టి మళ్లీ చేసుకోవాలనడంతో ప్రజలు మనస్తాపానికి గురవుతున్నారన్నారు. మంత్రి సీతక్క తమ పార్టీ కార్యకర్తలకు పథకాలను అందిస్తూ సామాన్య ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. నాగేశ్వర్రావు ఆత్మహత్యాయత్నానికి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.