పోచమ్మమైదాన్, జనవరి 7 : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ పిలుపునిచ్చారు. పోచమ్మమైదాన్‌లోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో జిల్లాలోని వైద్యాధికారులు, సిబ్బందికి కంటి వెలుగు కార్యక్రమంపై శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమం ప్రజలకు చేరువ కావడానికి మ్యాన్ పవర్, సామగ్రి అందుబాటులోకి వచ్చిందన్నారు. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం జయప్రదం కావడానికి ఆశ కార్యకర్త నుంచి వైద్యాధికారి వరకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
డిప్యూటీ డీఎంహెచ్‌వో గోపాల్‌రావు కంటి వెలుగు ప్రోగ్రాం గురించి పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గ్రామ స్థాయిలో పంచాయతీల ద్వారా, పట్టణ స్థాయిలో కమ్యూనిటీ సెంటర్ల ద్వారా ప్రజా ప్రతినిధుల సహాయంతో శిబిరం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి శిబిరంలో వైద్యాధికారి, ఆప్తమాలజిస్టు, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్ధం చేశామని వివరించారు. అలాగే ప్రతి శిబిరంలో ఐదు స్టాల్స్ ఏర్పాటు చేస్తారని, పద్ధతి ప్రకారం స్క్రీనింగ్ చేస్తూ అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని మానిటరింగ్ అధికారులు, మండల లెవల్లో స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారని వివరించారు.
ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తారని, క్యాంపులో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా కుర్చీలు, టెంట్, మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో 44 శిబిరాలు ప్రతి వారంలో ఐదు రోజుల చొప్పున వంద రోజులు పనిచేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, కంటి వెలుగు జిల్లా ఇన్చార్జి ప్రసాద్, డీడీఎం నితిన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.