నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 19 : అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వరంగల్‌తో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో మక్కజొన్న, వరి ధాన్యం, పత్తి పంట తడిసిపోయింది. నర్సంపేట, నెక్కొండ, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన మక్కలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. వరదలో కొట్టుకుపోతున్న మక్కలను ఒకదగ్గరికి చేర్చడం కోసం రైతులు నానా ఇబ్బందులుపడ్డారు. అయినా ఫలితం లేకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు.
అలాగే నర్సంపేట, నుంచి మల్లంపల్లి, భాంజీపేట, వరంగల్‌కు వెళ్లే ప్రధాన రహదారితో పాటు బయ్యారంలో రోడ్లకు ఇరువైపులా ఆరబోసిన మక్కలు సైతం వర్షానికి కొట్టుకుపోయాయి. తొర్రూరు, దుగ్గొండి మండలాల్లోని పలు గ్రామాల్లోని కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంతో పాటు మక్కజొన్న, పత్తిపంట తడిసిపోయింది. చెన్నారావుపేట మండలం బోజెర్వులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా, అకాల వర్షానికి తడిసిన మక్కలు, ధాన్యం, పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.