గిర్మాజీపేట, ఫిబ్రవరి 24 : జిల్లాలో ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరుగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 19 ప్రభుత్వ, ఏడు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కలిపి మొత్తం 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. ప్రథమ సంవత్సరంలో 6,164 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,456 మంది హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రాలను గుర్తించడం, విద్యార్థుల కేటాయింపుతోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు, సిట్టింగ్ స్కాడ్స్ నియామకం వంటివి పూర్తి చేసి పరీక్షల నిర్వహణపై వారికి అవగాహన కల్పించామన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని, నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి లేదని మాధవరావు అన్నారు. దూర ప్రాంతాల నుంచి పరీక్ష రాసే విద్యార్థులు ముందుగానే సెంటర్లకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. కళాశాలల్లో వందశాతం సిలబస్ పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం చేశామన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా వరంగల్ జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ, ఫ్లయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్‌ను ఏర్పాటు చేశామని, డెక్ మెంబర్లుగా జితేందర్‌రెడ్డి, కే శ్రీధర్ పర్యవేక్షించనున్నట్లు మాధవరావు వెల్లడించారు.