హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 11: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ కేంద్రంగా జరుగుతున్న అండర్-19 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో భాగంగా పూల్-ఏ విభాగంలో జరిగిన లీగ్ దశ పోటీలు ముగిసాయి. ఈ పూల్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన కరీంనగర్, వరంగల్ జట్లు సెమీఫైనల్‌కు చేరాయని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కరుణాపురం సమీపంలోని వంగాలపల్లి వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు వరంగల్‌ను 15 పరుగుల తేడాతో ఓడించింది పూల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణిత 50 ఓవర్లకు 38 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది.
రాహుల్, తక్షిల్ ఇద్దరూ 28 పరుగులతో రాణించారు. 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ 26.5 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. వరంగల్‌లోని మొగిలిచర్ల క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మరో మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టు నిజామాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన పాయింట్ల పట్టికల్లో 3వ స్థానంలోలో నిలిచి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ 34.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. రేవంత్ 68 పరుగులతో రాణించాడు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలాబాద్ 30.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయం సాధించింది.
పూల్-బీ మ్యాచ్‌లో మెదక్ జట్టు అగ్రస్థానంలో నిలువగా ఖమ్మం జట్టు రెండవ స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కి అర్హత సాధించింది. పూల్-బిలో అగ్రస్థానంలో నిలిచిన మెదక్ జట్టు పూల్-ఏ విభాగంలో రెండవ స్థానంలో నిలిచిన వరంగల్ జట్టు13న మొగిలిచర్ల గ్రౌండ్లో తలపడుతుండగా, ఇదే రోజు వంగాలపల్లి గ్రౌండ్లో మరో సెమీఫైనల్లో కరీంనగర్ జట్టు ఖమ్మం జట్టు తలపడుతుంది.. ఇందులో గెలుపొందిన జట్లు 14న ఫైనల్ పోరులో పాల్గొననున్నారు.