నెల్లికుదురు, ఫిబ్రవరి 20 : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా సర్కారు పాఠశాల్లో సకల సౌకర్యాలను కల్పించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడుత కింద 316 పాఠశాలలను ఎంపిక చేసింది. జిల్లాలో మొత్తం 1077 పాఠశాలలు ఉండగా 2021-22 విద్యా సంవత్సరంలో ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి ఎక్కువ విద్యార్థులున్న వాటికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిలో మౌలిక వసతులు కల్పించేందుకు 12 అంశాలపై ప్రత్యేకాధికారులతో ప్రత్యేక పరిశీలిన చేయించారు. సంబంధిత నివేదికల ఆధారంగా జిల్లా కలెక్టర్ వాటిపై సమీక్ష నిర్వహించారు.
12 అంశాలపై ప్రత్యేకాధికారులతో పరిశీలన
‘మన ఊరు మన బడి’కార్యక్రమాన్ని జిల్లాలో ఎంపిక కాబడిన పాఠశాలల్లో అమలు చేసేందుకు ప్రతి మండలంలోని ప్రత్యేకాధికారితో క్షేత్రస్థాయిలో పర్యటింప చేసి పాఠశాలలోని 12 అంశాలను పరిశీలించి సంబంధించి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. నివేదికలోని 12 అంశాలు ఇలా ఉన్నాయి.
విద్యార్థులను ఆకర్షించేలా..
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, అభ్యసనను ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైనది పాఠశాల వాతావరణం. అందులో ఉన్న వసతులు, పాఠశాల భవనాలు, తరగతి గదులు ఆకర్షణీయంగా ఉంటే విద్యార్థులు ఇష్టపడుతారు. ఇలా సౌకర్యాలు వారిలో చదువుపై ఆసక్తిని పెంచుతాయి. అన్ని వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి వాటిని విద్యార్థులు, సిబ్బంది వినియోగించుకోగలిగితే మెరుగైన ప్రమాణాలు ఉత్పన్నమవుతాయి. విద్యార్థుల అవసరాలన్నింటినీ తీర్చినప్పుడు విద్యావ్యవస్థను మరింత బలోపేతమై దేశ ప్రగతికి వెన్నెముకగా నిలుస్తుందని భావించి ప్రభుత్వం పల్లెల్లో ‘మన ఊరు-మన బడి’.. పట్టణాల్లో ‘మన బస్తీ-మన బడి’కి శ్రీకారం చుట్టింది. మూడు విడుతలుగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేసి మౌలిక వసతులు కల్పించనున్నది.