తొర్రూరు/పెద్దవంగర : ఎనిమిది దఫాలుగా బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు శూన్యంగా ఉండడం వల్లే కేసీఆర్ ఆవేదనతో కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తే ప్రతిపక్ష నేతలు అవగాహన లేక రాద్ధాంతం చేస్తూ విషపు కూతలు కూస్తున్నాయని మంత్రి సత్యవతి మండిపడ్డారు. తొర్రూరు, పెద్దవంగరలో ముఖ్య నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ ఒక ధోరణితో మాట్లాడితే కనీస పరిజ్ఞానం లేని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విష ప్రచారాలతో అంబేద్కర్‌ను అవమాన పరిచినట్లు చిత్రీకరిస్తున్నారని, ప్రజలంతా ఈ పరిణామాలను విజ్ఞతతో పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. దళితబంధు పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, తెలంగాణలో ఒక బడ్జెట్లో దళిత బంధుకు కేటాయించే నిధులు దేశం మొత్తం కోసం కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం దౌర్భాగ్యం అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి జనం జాతరలా తరలిరావాలని కోరారు. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ లాంటి బచ్చాగాళ్లు కూసే పిచ్చికూతలకు భయపడే ప్రసక్తేలేదని, వారు చేసే విమర్శలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. రాష్ర్టానికి బీజేపీ, కాంగ్రెస్‌లు ఒరగబెట్టిందేమిటో ప్రజలు నిలదీయాలన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలైనా ప్రవేశపెట్టండి లేదా తమను తెలంగాణలోనైనా కలపాలంటూ బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని ప్రజలు తీర్మానాలు చేస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై స్థాయికి మించి విమర్శలు చేయడానికి బీజేపీ నేతలకు సిగ్గుండాలని మంత్రి సత్యవతి మండిపడ్డారు.
దేశంలోని గిరిజనులకు కేటాయించిన బడ్జెట్, రాష్ట్రం కంటే తక్కువని దీనికి బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేంద్రం గిరిజనుల రిజర్వేషన్లు పెంచదు, ఎస్సీ వర్గీకరణ చేయదు, విభజన హామీలు నెరవేర్చదు, తెలంగాణలో దేనికీ జాతీయ హోదా ఇవ్వదని విమర్శించారు. రాజ్యాంగపరంగా వచ్చే రిజర్వేషన్లను అడ్డుకుంటూ రాజ్యాంగం మార్చమంటే ఎందుకు ఉలికి పడుతున్నారో చెప్పాలని నిలదీశారు. బీజేపీకి గిరిజనులు, దళితులంటే ఎంత చిన్నచూపో ఈ బడ్జెట్‌తో తేలిపోయిందన్నారు. తొర్రూరు సమావేశంలో ఎంపీపీ తూర్పాటి చిన్ని అంజయ్య, జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, రైతు బంధు మండల కో-ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఇట్టే శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు రామిని శ్రీనివాస్, కుర్ర శ్రీనివాస్, గుగులోతు శంకర్, బిజ్జాల అనిల్, చకిలేల మణిరాజ్, మహిళ, మండల యువజన విభాగాల అధ్యక్షులు తోట యశోద, బసనబోయిన మురళీయాదవ్ పాల్గొన్నారు. పెద్దవంగర సమావేశంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలయ్య, మండల ఇన్చార్జి మార్నేని వెంకన్న, ఎంపీపీ రాజేశ్వరి, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, జిల్లా, మండల రైతు బంధు సమితి సభ్యులు నెహ్రునాయక్, సోమనర్సింహరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పి.యాదగిరిరావు, మండల ప్రధాన కార్యదర్శి సంజయ్, నాయకులు సుధీర్‌కుమార్, రాము, లింగమూర్తి, మల్లికార్జునచారి, రాజు, శ్రీనివాస్, ముజీబుద్దీన్ పాల్గొన్నారు.