మహబూబాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికై తొలిసారి జిల్లాకు వచ్చిన ఎంపీ మాలోత్ కవితకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ర్యాలీలు, కోలాటాలు, కళాకారుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల నడు మ పూలుచల్లుతూ నీరాజనాలు పలికారు. ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతో మానుకోట గులాబీమ యమైంది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు జిల్లాలో ఆమె పర్యటన కొనసాగింది. తొలుత తొర్రూరుకు వచ్చిన కవితకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ మీదుగా కురవి మండల కేంద్రానికి చేరుకున్నారు. వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి జిల్లా కేంద్ర శివారులోని సాలర్తండా వద్దకు రాగానే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్ ఆత్మీయ స్వాగతం పలికారు. వారితో కలిసి ర్యాలీగా అండర్ బ్రిడ్జి, జిల్లా వైద్యశాల మీదుగా నెహ్రూసెంటర్, ఇందిరాగాంధీ సెంటర్ నుంచి ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
కేంద్రం తీరుపై మంత్రుల ఫైర్
అనంతరం తహసీల్దార్ కార్యాలయ సెంటర్లో ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కేంద్రప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ కాకుండా ఆపింది కేంద్ర ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు. అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందిన సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను అవమానించారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దళితులంటే కేసీఆర్‌కు ఇష్టముంది కాబట్టే దళితబంధు పథకం ద్వారా కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాం గ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీని కానీ, సీఎం కేసీఆర్‌ను ఇక మీదట విమర్శిస్తే తరిమి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్, పార్టీ జిల్లా కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేస్తే, త్వరలో కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇనుగుర్తి మండల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది..?
రాష్ట్ర విభజన చట్టంలోని హామీ ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఎందుకు నిర్మించడంలేదో కేంద్రప్రభుత్వం జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈసారి బడ్జెట్లో ఆ ఊసే లేదన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గిరిజనులపై వారికెంత ప్రేమ ఉన్నదో స్పష్టమవుతున్నదన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ఎంపీగా, ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. జిల్లాలోని అందరి నాయకులతో కలిసికట్టుగా పనిచేసి శెభాష్ అనిపించుకుంటానన్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్ రవిచంద్ర, హరినాయక్ పాల్గొన్నారు.