కురవి, మే 10 : ప్రమాదకరమైన బీపీ, షుగర్ వ్యాధుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేసీఆర్ సర్కారు ఎన్సీడీ(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కిట్లను సిద్ధంచేయగా, మంగళవారం మానుకోట జిల్లా కురవి మండలం పెద్దతండా వేదికగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. జిల్లా పర్యటనలో భాగంగా గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో కిట్ల పంపిణీకి రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నెలకు సరిపడా మందులున్న బ్యాగులను పలువురికి అందజేశారు. ఎన్సీడీ మందుల కిట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్దతండాలో జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కోటీ 80లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా 12,96,887 మందికి రక్తపోటు, 5,94,866 మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా రాష్ట్రమంతటా టెస్టులు పూర్తవుతాయని, వీరికి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల ద్వారా ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తున్నదని వివరించారు. నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా కిట్‌లో మూడు చిన్న బ్యాగులు అమర్చామని, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. మూడు పూటలా మందులు వాడాలని మంత్రి హరీశ్ సూచించారు.