కేసముద్రం/ములుగు రూరల్, మార్చి18: పండుగ పూట విషాదం నెలకొంది. శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ఘటనలకు మద్యం మత్తు, అతివేగమే కారణమని తెలుస్తుండగా బాధిత కుటుంబీకులు తీరని దుఃఖంలో మునిగిపోయారు.
కేసముద్రంలో రెండు బైక్‌లు ఢీకొని..
కేసముద్రం మండల కేంద్రంలో ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఓ యువతికి గాయాలయ్యాయి. ఎస్ఐ రమేశ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కట్టు కాలువతండాకు చెందిన భూక్యా బిచ్చా కొడుకు తరుణ్(25) మండల కేంద్రంలోని ఐరన్ దుకాణంలో పని చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న అదేతండాకు చెందిన అంగోత్ నరసింహ(40) హోలీ పండుగ కోసం ఈ 17న తన భార్య దేవితో కలిసి తండాకు వచ్చాడు. తరుణ్, నరసింహ తండావాసులతో కలిసి హోలీ ఆడుకున్నారు. ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లారు. మధ్యాహ్నం పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి ఓవర్ బ్రిడ్జి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో కేసముద్రానికి చెందిన చిదురాల వసంతరావు కూతురు శ్రావ్య తన బాబాయి నాగరాజు కొడుకు చిదురాల నరేశ్(25)తో కలిసి బైక్‌పై ఫూలే విగ్రహం సెంటర్ నుంచి ఓవర్ బ్రిడ్జి వైపు వెళ్తుండగా రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తరుణ్, నరసింహ, నరేశ్ తలకు తీవ్ర గాయాలు కాగా, శ్రావ్యకు స్వల్పగాయాలై రోడ్డుపై పడిపోయారు.
వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా, వారు వచ్చేలోపే తరుణ్, నరసింహ మృతిచెందారు. నరేశ్‌ను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మానుకోట ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా తరుణ్‌కు గతేడాది ఎండాకాలంలో ఇదే మండలంలోని కాట్రపల్లికి చెందిన వసుంధరతో వివాహమైంది. నరేశ్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. నరసింహకు కొడుకు, కూతురు ఉన్నారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. విషయం తెలిసి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఏరియా వైద్యశాలకు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, వైస్ చైర్మన్ ఫరీధ్, నాయకులు మార్నేని వెంకన్న, గుగులోత్ వీరూనాయక్, చిట్యాల జానార్దన్, గోగుల రాజు, మార్నేని రఘు, బోనగిరి గంగాధర్ ఉన్నారు.
ఇంచర్ల వద్ద బీభత్సం..
ములుగు మండలం ఇంచర్ల శివారు ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం మూడు కార్లు, ఒక బైక్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన కాలేరు సందీప్, సురేశ్‌తో కలిసి కారులో మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని తిరిగి వస్తున్నారు. ఇదే క్రమంలో హనుమకొండ రాంనగర్‌కు చెందిన లింగంపల్లి మహేశ్(24) అతడి స్నేహితుడు సంతోష్‌తో కలిసి కారులో ఏటూరునాగారం వైపు వెళ్తున్నాడు. ఎర్రిగట్టమ్మ నుంచి 100 మీటర్ల దూరం దాటిన తర్వాత మహేశ్ కారును మేడారం నుంచి వస్తున్న సందీప్ కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక కారు ములుగు నుంచి అటువైపు బైక్‌పై వస్తున్న నూనావత్ పుష్పరాజ్‌ను అలాగే మరో కారును కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంనగర్‌కు మహేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ములుగు, వెంకటాపూర్ పోలీసులు కార్లలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను ఎక్స్కవేటర్ల సాయంతో బయటకు తీసి 108 వాహనాల్లో దవాఖానకు తరలించారు. మిగతా ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఎంజీఎంకు రెఫర్ చేశారు. మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సందీప్ కారులో ఉన్న మద్యం బాటిళ్లను చూస్తే తెలుస్తోంది.
కారులోంచి బ్లూటూత్ స్పీకర్ ఎత్తుకెళ్లి.. ఆపై జులుం
ఓ వైపు ప్రమాదం జరిగి.. క్షతగాత్రులు వాహనాల్లో ఇరుక్కొని ఉంటే.. ఓ వ్యక్తి హస్తలాఘవం ప్రదర్శించాడు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటే.. ఇదే సమయంలో వెంకటాపురం మండలం జవహర్‌నగర్ గ్రామ సర్పంచ్ భర్త శనిగరపు రమేశ్, మరో వ్యక్తి కలిసి నుజ్జునుజ్జయిన ఓ కారులోని బ్లూటూత్ స్పీకర్‌ను రక్తం కారుతుండగా తుడుచుకొని మరీ ఎత్తుకెళ్లారు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు అలా తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని తెలిపి రమేశ్‌ను అడ్డుకోగా, తాను సర్పంచ్‌నని వెంకటాపూర్ ఎస్సైకి చెప్పి తీసుకొని వెళ్తున్నానని బైక్‌పై ఆగకుండా స్పీకర్‌ను తీసుకొని జవహర్‌నగర్‌కు వెళ్లిపోయాడు. ఎస్సై రాధికకు కానిస్టేబుల్ ఫోన్ చేసి అడుగగా తాను తీసుకెళ్లమని ఎవరికీ చెప్పలేదని బదులివ్వడంతో కానిస్టేబుళ్లు జవహర్‌నగర్‌కు వెళ్లగా ఇవ్వకుండా పోలీసులపై జులుం ప్రదర్శించాడు. పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించిన రమేశ్‌పై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.