– రేవంత్ బ్రోకర్ రాజకీయాలు చేస్తూ సీఎం అయ్యాడు
– దమ్ముంటే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలి
– కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎర్రబెల్లి ఫైర్
తొర్రూరు, అక్టోబర్ 04 : చట్టపరంగా చెల్లని జీఓ తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలంలోని హరిపిరాల, వెలికట్టే గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఎంపీటీసీ క్లస్టర్ సమావేశాలకు ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై, కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేసి, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని, కానీ బ్రోకర్ రాజకీయాలు ఆడుతున్నట్లు దుయ్యబట్టారు. మూడుసార్లు గెలవకపోయినా బ్రోకర్ పనులు చేస్తూ ముఖ్యమంత్రి అయ్యాడన్నారు.
రెండు సంవత్సరాల క్రితం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను తరచూ వాయిదా వేస్తూ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. హైకోర్టు గడువు ఒత్తిడిలోనే ప్రభుత్వం బీసీలపై మొసలి కన్నీరు కారుస్తూ రాజ్యాంగబద్ధం కానీ జీఓను తెచ్చిందన్నారు. బీసీ సంఘాలు, రాజ్యాంగ నిపుణులు కూడా ఈ జీఓ చెల్లదని చెబుతున్నా, ప్రభుత్వం నోరు మెదపకపోవడం వెనుక దాగివున్న మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రకటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తప్పా మరే ఒక్క మంత్రి, ఎమ్మెల్యే ఎన్నికలపై మాట్లాడక పోవడం కాంగ్రెస్ లోపాలను బయట పెడుతోందన్నారు.
ఎన్ని సర్వేలు చేయించినా తీవ్ర ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్‌పై ఉందని తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మోసపూరిత పద్ధతులు అవలంబిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 22 నెలల్లో ప్రజలకు ఎంత బాకీ పడిందో స్పష్టంగా చూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన ‘కాంగ్రెస్ బాకీ కార్డులను’ ఇంటింటికి పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులను సూచించారు. ప్రజల అవగాహన పెరిగింది, పాలకుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
Thorrur : ‘చెల్లని జీఓతో ఎన్నికల డ్రామా’