నర్సింహులపేట ఫిబ్రవరి 24 : నర్సింహులపేట మండలంలోని గోల్ బోక్కతండా జీపీ పరిధిలో 31 మంది మరుగుదొడ్లు నిర్మాణించుకున్నారు.(Toilet bills) కాగా, పూర్తి చేసిన లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి తన సొంత ఖాతాలో జమ చేసుకోవడంపై బాధితులు ఆందోళన చేపట్టారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి మాజీ సర్పంచ్ బాధవత్ సరోజ ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామంలో 31 మంది లబ్ధిదారులు మరుగు దొడ్లు నిర్మాణం చేసుకున్నారని, ఒక్కో లబ్ధిదారుడికి రూ.12 వేల చొప్పున రూ.3,72000 స్వాహా చేశారని ఆరోపించారు.
సర్పంచ్ సంతకంతో పాటు 31 మంది లబ్ధిదారుల సంతకాలను పోర్జరీ చేసి నిధులు కాజేశారన్నారు.ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యుడైన కార్యదర్శి పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో యాకయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్య తీసుకుంటామని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.