నర్సింహులపేట, మార్చి 15: మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట (Narsimhulapeta) మండలంలోని రామన్నగూడెంలో దుండగులు రెండు విద్యుత్ మోటర్లు పగులగొట్టి కాపర్ వైరు చోరీచేసిన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మెరుగు వెంకన్న, గంగాధరి అంతయ్యకు చెందిన వ్యవసాయ బావి నీళ్లు కోసం ఏర్పాటు చేసిన రెండు మోటర్లను పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు అందులోని కాపర్ వైర్‌ను చోరీ చేశారు.
వరుస దొంగతనాలతో రైతుల ఆందోళన
మండలంలోని ముంగిమడుగు గ్రామంలో నెల రోజుల క్రితం దొంతు రాములుకు చెందిన వ్యవసాయ బావి మోటర్‌ను పగుళ గొట్టి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైరును ఎత్తుకెళ్లారు. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. నెలల రోజుల్లో దాదాపు 3 మోటర్లు ధ్వసం చేసిన ఘటనలు ఉన్నాయి. సంబంధిత అధికారులు నిఘా ఏర్పాటుచేసి నిందితులను అందుపులోకి తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.