మండపాలను ముస్తాబు చేసిన నిర్వాహకులు
వరంగల్‌లో రెండు వేలకుపైగా మండపాలు
నేడు కొలువు దీరనున్న గణపయ్యలు
ప్రశాంతంగా ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అవగాహన కార్యక్రమాలు
నిమజ్జనం కోసం చెరువులను పరిశీలించిన సీపీ, కలెక్టర్, కమిషనర్
వరంగల్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) :కరోనా కారణంగా గతేడాది గణేశ్ ఉత్సవాలు జరుపుకోలేదన్న నిరుత్సాహంలో ఉన్న నిర్వాహకుల్లో ఈ సారి జోష్ కనిపిస్తున్నది. కొవిడ్ తీవ్రత తగ్గడం, ఈ సారి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో గల్లీగల్లీలో గణనాథులను నెలకొల్పేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి జిల్లాలో 2వేలకు పైగా మండపాలు ఏర్పాటు కానుండగా, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కమిటీలకు పోలీసులు అవగాహన కల్పించారు. మరోవైపు చెరువులు నిండుగా ఉండడంతో నిమజ్జనానికి ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూడాలని సీపీ తరుణ్‌జోషి, కలెక్టర్ గోపి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, ఏసీపీ గిరికుమార్ పలు గ్రామాల్లో చెరువులను క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేశారు. విఘ్నేశ్వరుడు కొలువు దీరే మండపాలను ముస్తాబు చేశారు. వేదిక, షామియానా, విద్యుత్ లైట్లు, ఫ్లెక్సీలు, స్పీకర్లు, తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు కూడా చేపట్టారు. వినాయక చవితిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకునేందుకు సకల జనులు రెడీ అయ్యారు. నిర్వాహకులు మండపాలను సిద్ధం చేశారు. గల్లీగల్లీలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముస్తాబు చేశారు. సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొంది వేదికలను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా పొంది లైట్లు, స్వీకర్లను అమర్చారు. వర్షం కురిసినా భక్తులకు ఇబ్బంది కలుగకుండా మండపాల వద్ద షామియానాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రతిష్ఠించేందుకు వినాయకుడి విగ్రహాలను కొని తెచ్చారు. జిల్లా కేంద్రమైన వరంగల్‌లో సుమారు రెండు వేలకుపైగా గణేశ్ మండపాలు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ 31 డివిజన్లలో వెలిసిన మండపాలను స్థానిక అధికారులు పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలోని ప్రతి వార్డు, కాలనీలో, ఆయా మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో వాడవాడలా గణేశ్ మండపాలు వెలిశాయి. కరోనా ఉధృతి తక్కువగా ఉందని ఈసారి భారీ ఏర్పాట్ల నడుమ గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అధికారులు గురువారం మండపాలను సందర్శించి అనుమతులను పరిశీలించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపాల నిర్వాహకులతో స్థానిక పోలీసు అధికారులు కొద్ది రోజుల నుంచి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు, మండపాల నిర్వహణ, అనుమతులు, కరోనా నిబంధనలపై అవగాహన కల్పించారు. భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. వరంగల్, మామునూరు, నర్సంపేట, ఏసీపీలు కే గిరికుమార్, నరేశ్, ఫణీందర్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
గతంలో కేవలం వరంగల్‌లోని వివిధ చెరువుల్లో సుమారు మూడు వేల గణేశ్ విగ్రహాలను మండపాల నిర్వాహకులు నిమజ్జనం చేశారు. ఇలా జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మన్సిపాలిటీ పరిధిలోని ప్రతి గ్రామ చెరువులో మండపాల నిర్వాహకులు వినాయక విగ్రహాలను పెద్ద సంఖ్యలో నిమజ్జనం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా జిల్లాలోని చెరువుల్లో భారీ ఎత్తున విఘ్నేశ్వరుడి విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, జిల్లా కలెక్టర్ బీ గోపి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, జిల్లా అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ గణేశ్ నిమజ్జనం జరిగే చెరువులను సందర్శించారు. వరంగల్‌లో ములుగురోడ్డులోని కోటచెరువు, దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి, గొర్రెకుంటలోని కట్టమల్లన్న చెరువు, ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఉర్సు గుట్ట చెరువు, మామునూరు రోడ్డులోని బెస్తం చెరువును పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో స్థానిక అధికారులకు సూచనలు చేశారు. నిమజ్జనం జరిగే అన్ని చెరువుల వద్ద ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచాలని, వాహనాల రాకపోకలు సవ్యంగా జరిగేలా రోడ్లను సిద్ధం చేయాలని, ఈన్ని చెరువుల వద్ద క్రేన్లు, పడవలు, గత ఈతగాళ్లు, రెస్క్యూటీంతో పాటు పశు వైద్య శిభిరాలను ఏర్పాటు చేయాలని, అంబులెన్సులు కూడా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ బీ గోపి, సీపీ తరుణ్‌జోషి అన్నారు.సెంట్రల్, ఈస్ట్‌జోన్ డీసీపీలు పుష్ప, వెంకటలక్ష్మి, వరంగల్ ఆర్డీవో మహేందర్‌జీ, ఏసీపీ గిరికుమార్‌తో పాటు రెవెన్యూ, ఎన్పీడీసీఎల్, వైద్య ఆరోగ్య, మున్సిపల్, జల వనరుల, అగ్నిమాపక, దేవాదాయ, మత్స్య తదితర శాఖల జిల్లా అధికారులు కలెక్టర్, కమిషనర్ల వెంట ఉన్నారు.
ప్రశాంతంగా జరుపుకోవాలి
ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలి. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలి. వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరిశీలించి స్టేషన్ పోలీసు అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారు. మండపాలను ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఎన్పీడీసీఎల్ అనుమతితో మండపాలకు విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉం టుంది. నిర్వాహకులు మండపం కమిటీ వివరాలు, బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపం వద్ద ఏర్పాటు చేయాలి. రాత్రి పది గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి. మండపాల్లో డీజేను ఏర్పాటు చేయొద్దు. మండపంలో 24 నాలుగు గంటలు ఒక వలంటీర్ ఉండాలి. భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయాలి. మండపాల్లో అనుమానస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు కనపడితే వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.