నర్సంపేట, జూలై 12: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తన నుంచి విడగొట్టి, మరొకరికిచ్చి వివాహం జరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కక్ష పెంచుకుని దీపిక కుటుంబంపై నాగరాజు ఘాతుకానికి పాల్పడినట్లు డీసీపీ రవీందర్ తెలిపారు. నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతలతండా గ్రామంలోని దీపిక ప్రేమించుకున్నారు. 2023 నవంబర్‌లో ప్రేమ వివాహం చేసుకోగా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సుగుణ, శ్రీనివాస్ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తాను నాగరాజుతోనే వెళ్తానని పోలీసుల ఎదుట దీపిక చెప్పింది. కొంతకాలం దీపిక, నాగరాజు హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో దీపిక తల్లిదండ్రులతో ఉంటోంది.
ఈ నేపథ్యంలో దీపికను తన నుంచి దూరం చేశారని ఆమె తల్లిదండ్రులపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. హైదరాబాద్ నుంచి ఐదు నెలల క్రితం గుండెంగకు వచ్చిన నాగరాజు ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. నెలరోజుల క్రితం నెక్కొండలో కత్తిని కొనుగోలు చేశాడు. మరో కత్తి ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. ఈ నెల 11న రాత్రి ఒంటిగంట సమయంలో 16చింతలతండాకు చేరుకొని ఆరుబయట రేకుల షెడ్ కింద నిద్రిస్తున్న దీపికపై దాడి చేయపోగా ఆమె చేతులు అడ్డం పెట్టడంతో గాయాలయ్యాయి. వెంటనే పక్కనే ఉన్న తల్లి సుగుణ, తండ్రి శ్రీనివాస్‌పై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం దీపిక తమ్ముడు మదన్‌లాల్ మెడపై కూడా దాడి చేశాడు. వారి అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని నాగరాజును వారించబోగా అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెక్కొండ సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో టీంలుగా ఏర్పడి నిందితుడిని వడ్డేపల్లి జంక్షన్ వద్ద పట్టుకున్నారు. మృతుడి తల్లి బానోత్ ఈరమ్మ ఫిర్యాదుతో మేకల నాగరాజు అలియాస్ బన్నీపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. సమావేశంలో ఏసీపీ కిరణ్‌కుమార్, నెక్కొండ సీఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.