వరంగల్, మానుకోట లోక్‌సభ స్థానాల పోలింగ్ తుది వివరాలను ఈసీ మంగళవారం వెల్లడించగా 2019 కంటే ఎక్కువ శాతం నమోదైంది. వారాంతం కలిసిరావడం, అంతకుముందు రోజు జోరువాన కురిసి వాతావరణం చల్లబడడం కూడా ఓటింగ్ శాతం పెరిగేందుకు కారణమైంది. గత ఎన్నికలతో పోల్చితే వరంగల్‌లో అదనంగా 5.16 శాతం(68.86%), మహబూబాబాద్‌లో 2.79శాతం(71.85%) నమోదు కాగా, పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలంగా ఉంటుందని ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ధీమా వ్యక్తమవుతోంది. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ గెలుపు తమదేనంటూ విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. కాగా ఐదేళ్ల క్రితం ఈ రెండు చోట్లా బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించగా ఈసారి కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెబుతున్నారు.
వరంగల్, మే 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ అయిన ఓట్ల వివరాలపై స్పష్టత వచ్చింది. పోలింగ్ వివరాలపై తుది గణాంకాలను కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం వెల్లడించింది. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్లో 68.86 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్లో స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి అత్యధికంగా 78.77 శాతం పోలింగ్ నమోదైంది. ఎప్పటిలాగే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అతి తక్కువగా 52.68 శాతం పోలింగ్ అయ్యింది. పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లో 76.86 శాతం, వర్ధన్నపేటలో 72.24 శాతం, భూపాలపల్లిలో 67.71 శాతం వరంగ ల్ తూర్పులో 65.08 శాతం నమోదైంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ సెగ్మెంట్లో 63.70 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఈసారి 5.16 శాతం ఎక్కువ పోలింగ్ అయ్యింది. అకాల వర్షంతో వాతావరణం చల్లబడడం ఈసారి పోలింగ్ పెరిగేందుకు ప్రధాన కారణంగా
కనిపించింది. యువత, ఇతర ప్రాంతాల్లో ఉండే వారు సొంత ఊర్లకు వచ్చి ఉత్సాహంగా ఓటు వేశారు. పోలింగ్ శాతం పెరగడం ఏ పార్టీలకు ఉపయోగకరంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా పోటీలో ఉన్న మూడు పార్టీల్లో ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచింది. పోలైన ఓట్లలో 58.70 శాతం బీఆర్ఎస్కు పడ్డాయి. కాంగ్రెస్‌కు 25.10, బీజేపీకి చాలా తక్కువగా 8శాతమే పోలింగ్ నమోదైంది.
మహబూబాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో 71.85% పోలింగ్ నమోదైంది. ఈమేరకు తుది గణాంకాలను కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం వెల్లడించింది. ఇందులో అత్యధికంగా నర్సంపేట నియోజకవర్గంలో 76.60%, అత్యల్పంగా భద్రాచలంలో 69.02 శాతం పోలింగ్ అయ్యింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,32,366 ఓట్లు ఉండగా, 11,01,030 ఓట్లు పోలయ్యాయి. 2019లో 69.06 శాతం ఓట్లు నమోదు కాగా, ఈసారి 71.85% ఓట్లు నమోదయ్యాయి. గతం కంటే 2.79శాతం ఎక్కువ నమోదు కాగా పెరిగిన ఓటు శాతం ఎవరికి కలిసొస్తుందోనని ఆయా పార్టీలు ఎవరికి వారే లెకలు వేసుకుంటున్నారు.
