ఓట్ల పండుగకు వేళయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ జరుగనుండగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 3709 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా ఆదివారం సాయంత్రంలోపు ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటలకు పోలింగ్ కొనసాగనుండగా, భూపాలపల్లి, ములుగు వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో 4గంటలకే ముగియనుంది.
వరంగల్ నుంచి 42మంది, మానుకోట నుంచి 23మంది అభ్యర్థులు బరిలో నిలువగా, రెండు చోట్ల కలిపి మొత్తం 33,56,832 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రత్యేకంగా దివ్యాంగ, మహిళ, మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
– వరంగల్, మే 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో దివ్యాంగ, మహిళ, మోడల్ పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేశారు. స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని 1,900 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్లతో సిబ్బంది తరలివెళ్లారు. 2,126 మంది పీవోలు, 2,126 మంది ఏపీవోలు, 4,342 మంది ఓపీవోలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ పశ్చిమ, పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలకు ఎనుమాముల మారెట్ యార్డులో, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు సమీపంలోని కేంద్రాల్లోనే పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు. పోలింగ్ అనంతరం ఏడు సెగ్మెంట్లలోని ఈవీఎంలను ఎనుమాములలోని గోడౌన్లో భద్రపరచనున్నారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనున్నది.
వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్లో 42 మంది పోటీ పడుతున్నారు. పోటీ ప్రధానంగా బీఆర్ఎ స్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ఉన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పదేండ్ల పాలనపై, రాష్ట్రంలో ఐదు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్రంగా ఉన్న అసంతృప్తి బీఆర్ఎస్కు సానుకూలంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను ప్రజలను గమనించారని, పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ ఆశాభావంతో ఉన్నది.
బీఆర్ఎస్ తరపున డాక్టర్ మారెపల్లి సుధీర్‌కుమార్, కాంగ్రెస్ నుంచి డాక్టర్ కడియం కావ్య, బీజేపీ తరపున అరూరి రమేశ్ పోటీలో ఉన్నారు. వరంగల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి అగ్రనాయకులు వచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు అనూహ్య స్పందన వచ్చింది. బీజేపీ అభ్యర్థి తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు. వరంగల్ నగరంలో రోడ్ షో నిర్వహించారు.
మహబూబాబాద్, మే 12(నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ లోకసభ పరిధిలో ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 23మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం 15,32,366 మంది ఓటర్లు ఉన్నారు. 7,84,424 మహిళలు, 7,47,836 మంది పురుషులు, 106 మంది ఇతరులు ఉన్నారు. 1,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 317 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.
నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు, ములుగు, ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. 8,683 మంది పోలింగ్ సిబ్బంది, సుమారు 6వేల మంది పోలీసులు, మరో 1,500 మంది కేంద్ర బలగాలను కేటాయించారు. మహబూబాబాద్ లోక్‌సభ బరిలో 23 మంది అభ్యర్థులు ఉండగా, బీఆర్ఎస్ తరపున మాలోత్ కవిత, కాంగ్రెస్ నుంచి బలరాంనాయక్, బీజేపీ తరపున సీతారాంనాయక్ పోటీలో ఉన్నారు.