ములుగు, సెప్టెంబర్10(నమస్తేతెలంగాణ): బతుకుదెరువు కోసం పెట్టుకున్న చిన్న చిన్న కిరాణా షాపులు, బడ్డీ కొట్లలో మద్యం అమ్మాల్సిందేనంటూ వ్యాపారులు ఓ ముఠాగా ఏర్పడి బెదిరిస్తున్నారు. మాట వింటే రోజు ఆటోలో ఉదయం 9 గంటల లోపే మద్యం వస్తుందని, లేదంటే సాయం త్రం ఎక్సైజ్ అధికారులు వస్తారంటూ భయపెడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి ముద్దమళ్ల కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం..
లాభం వస్తుందనే ఉద్దేశంతో వెంకటాపూర్ షాపు నుంచి మద్యాన్ని తీసుకొచ్చి కొన్ని రోజులుగా విక్రయించా. ఆ తర్వాత తమ షాపు వద్దకు రావద్దని, తామే ఆటోలో డెలివరీ చేస్తామని, తమ మద్యమే విక్రయించాలని వ్యాపారి హుకుం జారీ చేశాడు. వేరే దుకాణాల్లో తెస్తే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయించి షాపును మూసివేయిస్తానని బెదిరించాడు. దీంతో తాను మద్యాన్ని అమ్మ డం మానేశాను.
ఈ క్రమంలో సోమవారం మద్యం షాపునకు చెందిన కొందరు వ్యక్తు లు వచ్చి షాపులో ఇతర మద్యం ఏమైనా విక్రయిస్తున్నాడా అనే అనుమానంతో తనిఖీలు చేసి సామాన్లను చిందరవందర చేశారు. మద్యం వ్యాపారులు వచ్చి తన షాపులో తనిఖీలు చేయడం ఏమిటని కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, మంగళవారం ఆటోలో వెంకటాపూర్ షాపు నుంచి మద్యాన్ని పంపించగా కరుణాకర్ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం చేసి తాను దుకాణంలో మద్యం అమ్మనని తిరిగి వెనక్కి పంపించాడు.
ఎమ్మార్పీ కంటే రూ. 30 అదనం
గ్రామాల్లో కిరాణా షాపులు నడుపుతున్న వారిని టార్గెట్ చేస్తూ వ్యాపారులు కల్తీ మద్యం విక్రయ దందాకు తెరలేపుతున్నారు. కిరాణా దుకాణాలను బెల్ట్ షాపులుగా మార్చుతున్నారు. ఎంఆర్పీ కంటే రూ.30 అదనంగా దుకాణాదారులకు మద్యాన్ని డెలివరీ చేస్తూ తమ దందాను విస్తరిస్త్తున్నారు. గ్రామాల్లో మద్యం విక్రయాలపై కొరడా ఝలిపించాల్సిన సంబంధిత శాఖ అధికారులు మామూళ్లకు కక్కుర్తి పడి నిబంధలను గాలికి వదిలేస్తున్నారు. టార్గెట్లు పూర్తి చేయాలని భావనతో మద్యం సిండికేట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది చాలదన్నట్లు వ్యాపారులు ఏ షాపుపై దాడులు చేయాలో చెబితే అదే పాటించడం అలవాటుగా మారింది. ఉన్నతాధికారులు స్పందిం చి ఇలాంటి దందాకు చెక్ పెట్టాల్సిన అవసరముందని స్థానికులు కోరుతున్నారు.