హనుమకొండ, సెప్టెంబర్ 29 : సప్త స్వ రాల ‘సరిగమపదనిస’ పార్కు మూగబోతున్నది. సంగీత ప్రియులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కు ఉనికిని కోల్పోతున్నది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నది. చారిత్రక, పర్యాటక నేపథ్యం ఉన్న పద్మాక్షి ప్రాంతం లో అగ్గలయ్యగుట్ట, పద్మాక్షి, సిద్ధేశ్వర తదితర చారిత్రక దేవాలయాలున్నాయి. ఇక్కడ రెండేళ్ల క్రితం రూ.కోటి నిధులతో సంగీత ప్రియుల కోసం నిర్మించిన ఈ పార్కులో దేశంలోని వివిధ రాష్ర్టాలు, ప్రాంతాలకు చెం దిన సంగీత నృత్య భంగిమలున్న విగ్రహాలను ఏర్పాటు చేశారు.
‘సరిగమపదనిస’లను తెలియజేసే ఏడు విగ్రహాలను నెలకొల్పారు. పార్కు ముందు భాగంలో ఆర్చిని రూపొందించి గ్రీనరీ ఏర్పాటు చేశారు. ఒడిశా నుంచి సాండ్ స్టోన్‌ను తెప్పించి విగ్రహాలను చెక్కించారు. ఇలాంటి పార్కును అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి పూట లైట్లు లే కపోవడంతో మందుబాబులు అడ్డాగా మా ర్చుకున్నారు. ఎక్కడ చూసినా తాగి పడేసిన బీరు, బ్రాంది సీసాలే దర్శనమిస్తున్నాయి. అలాగే విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని పార్కును వినియోగంలోకి తీసుకురావాలని సంగీత ప్రియులు, ప్రజలు కోరుతున్నారు.