వాజేడు మండల ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో కిష్టాపురం గ్రామంలోని మోడికుంట వాగుపై నాటి పాలకులు 2.14 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి 2005లో పునాదిరాయి వేసినా అడుగు ముందుకుపడలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని అటవీ శాఖ అనుమతులు, సీడబ్ల్యూసీ, డీపీఆర్ క్లియరెన్స్ చేయించడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికి 2022లో రూ.527.66 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో 266ను విడుదల చేశారు. టీఏసీ క్లియరెన్స్‌కు ఇరిగేషన్ అధికారులు నివేదికలు సమర్పించినప్పటికీ అనుమతులు రాలేదు. జిల్లాల ఏర్పాటు తర్వాత ములుగుకు చీఫ్ ఇంజినీర్‌ను నియమించడంతో పూర్తి స్థాయి డీపీఆర్‌ను తయారు చేసి ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన టీఏసీ సమావేశంలో ఆయన ప్రాజెక్టు నిర్మాణ అవశ్యకతను వివరించగా కమిటీ అనుమతులిచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 36 గ్రామాలకు సాగు, తాగు నీరు అందనుంది.
ములుగు, జూలై15 (నమస్తే తెలంగాణ)/వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం క్రిష్టాపురం గ్రామ సమీపంలోని మోడికుంట వాగు ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియరైంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి హాజరైన సభ్యులకు జిల్లా సాగు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ విజయభాస్కర్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ అవశ్యకత, మంజూరు చేసిన నిధులను, సేకరించిన భూముల వివరాలను వివరించారు. సంతృప్తి చెందిన టీఏసీ కమిటీ సభ్యులు ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. మోడికుంట వాగుపై ప్రాజెక్టును నిర్మాణానికి 2005లో నాటి పాలకులు రూ.124.60 కోట్లు మంజూరు చేయగా అటవీ శాఖ అనుమతులు, సీడబ్ల్యూసీ, డీపీఆర్ క్లియరెన్స్ రాకపోవడంతో పనులు ప్రారంభంకాలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అటవీ శాఖకు వేరే ప్రాంతంలో 1,236 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి అప్పగించారు. పూర్తి సమాచారంతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి కేంద్ర జలవనరుల సంఘానికి 2021 సెప్టెంబర్ 10న డీపీఆర్‌కు సమర్పించారు. అనంతరం 2022 ఆగస్టు 29న ప్రాజెక్టు నిర్మాణానికి రూ.527.66కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో నంబర్ 266ను విడుదల చేయగా డీపీఆర్‌ను జీఆర్ఎంబీ నుంతచి అధికారులు క్లియర్ చేయించారు. అప్పటి నుంచి టీఏసీ క్లియరెన్స్ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సాగు నీటి శాఖ అధికారులు పలుమార్లు నివేదికలు సమర్పించినప్పటికీ టీఏసీ అనుమతులు పొందలేదు. రాష్ట్రంలో జిల్లాలు ఏర్పాటైన తర్వాత సాగు నీటి శాఖను బలోపేతం చేసి ములుగు జిల్లాకు చీఫ్ ఇంజినీర్ అధికారిని నియమించారు. దీంతో ఆయన పూర్తి స్థాయి డీపీఆర్‌ను తయారు చేసి ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన టీఏసీ సమావేశంలో సభ్యులకు అవగాహన కల్పించడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి.
2.14టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం
భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని ములుగు జిల్లా వాజేడు మండలం క్రిష్టాపురం గ్రామంలోని మోడికుంట వాగుపై 2.14 టీఎంసీల సామర్థ్యంతో 36 గ్రామాలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందులో భాగంగా 28.39 కిలో మీటర్ల మేర కాల్వల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు కుడివైపు 5.72 కిలోమీటర్లు, ఎడమ వైపు 22.67 కిలోమీటర్ల మేర కాల్వల నిర్మించనున్నారు. ప్రాజెక్టు ఆయకట్టులో భాగంగా వానకాలంలో 13,591ఎకరాలకు, ఎండకాలంలో 6,796 ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం 2021లో నిధులు మంజూరు చేయడంతో త్వరలో ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతమైన 36 గ్రామాల ప్రజల చిరకాల వాంఛ తీరనున్నది.
తుది అనుమతులు వచ్చాయి..
మోడికుంట వాగుపై ప్రాజెక్టు నిర్మాణానికి తుది అనుమతులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే బృందంతో ఢిల్లీలో జరిగిన టీఏసీ సమావేశానికి ఇటీవల హాజరయ్యాను. మోడికుంట వాగు ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను వివరించగా సభ్యులు సంతృప్తి చెందారు. త్వరలో ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు చేసి ప్రారంభానికి ఏర్పాట్లుచేస్తాం.
– విజయభాస్కర్‌రావు, సాగునీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్, ములుగు జిల్లా
వ్యవసాయానికి సరిపడా నీరు అందుతుంది
ప్రాజెక్టు నిర్మాణంతో వ్యవసాయానికి సరిపడా నీరు అందుతుంది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు అనుమతులు రావడం ఆనందంగా ఉంది. అన్ని అడ్డంకులు తొలగించి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయ డం సంతోషంగా ఉంది. సాగునీటితో పాటు తాగునీరు కూడా అందుతుంది.
– పూణెం నాగచంద్ర, క్రిష్టాపురం గ్రామ సర్పంచ్
18 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నా
మోడికుంట వాగు ప్రాజెక్టు నిర్మాణానికి 18 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాం. 2005లో ప్రాజెక్టు పనులకు ప్రతిపాదనలు రాగా ఇంత కాలానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషితో అనుమతులు రావడం సంతోషంగా ఉంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండు పంటలు పండించుకోవచ్చు.
– మాడె క్రిష్టయ్య, క్రిష్టాపురం గ్రామ రైతు