కురవి/ మరిపెడ/ నర్సింహులపేట, దంతాలపల్లి/ చిన్నగూడూరు, జనవరి 16 : ఖమ్మంలో ఈ నెల 18న జరుగునున్న బీఆర్ఎస్ సభ చరిత్రాత్మకం కానున్నదని, ఈ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బీఆర్ఎస్ సత్తా చాటాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. కురవి, మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి , చిన్నగూడూరు మండల కేంద్రాల్లో జరిగిన ఖమ్మం బహిరంగ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లలోనే రాష్ర్టాన్ని దేశానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
దేశ రైతాంగ సమూల మార్పునకు, అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఆవిర్భవించిందన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే పార్టీలు ఎన్నికలతోనే మాయమవుతాయన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు పక్క రాష్ర్టాల ముఖ్యమంత్రులు వస్తున్నారని.. ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పాలన, దేశ వ్యాప్తంగా అమలు చేసే కార్యాచరణను బహిరంగసభలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వివరిస్తారన్నారు. సభను జయప్రదం చేసి బీజేపీ కళ్లు తెరిపించాలన్నారు. బీజేపీ అధికారమే ధ్యేయంగా పాలన సాగిస్త్తోందని, విభజన హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు మాత్రం అధిక నిధులు కేటాయిస్తోందన్నారు.
రోడ్ల బకాయిలే రూ.11వందల కోట్లు కేంద్రం నుంచి రావాలన్నారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేవీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. దేశ వ్యాప్తంగా 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కేంద్రం ఒక ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదని విమర్శించారు. కేంద్రం వ్యవసాయ మోటర్లకు మీటర్లను ఏర్పాటు చేసి రైతుల నడ్డి విరిచే కుట్ర చేస్త్తోందన్నారు. గతంలో ఎన్టీఆర్ అన్ని పార్టీలను ఏకం చేసి కూటమిగా ఏర్పాటు చేసి, కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో ఎలా గద్దె దించారో అదే మాదిరిగా ఇప్పుడు బీజెపీని గద్దె దించడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద సీట్లు గెలవడం ఖాయమన్నారు. సభకు జిల్లా నుంచి లక్ష మందిని తరలించే కార్యాచరణ రూ పొందించామని మంత్రి తెలిపారు.
జిల్లా నుంచి లక్ష మందిని తరలించడమే లక్ష్యంగా పార్టీ కృషి చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత అన్నారు. బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో అవలంబించనున్న విధానాలపై యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోందన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు దిమ్మ దిరిగేలా జనసమీకరణ జరగాలని అన్నారు. కార్యక్రమాల్లో మానుకోట జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ బోడ కుంటి వెంకటేశ్వర్లు, జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షులు డీఎస్ రవిచంద్ర, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా మాజీ చైర్మన్ యాదవరెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఆర్అండ్బీ చైర్మన్ మెట్టు శ్రీను, జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వ ర్‌రెడ్డి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేం దర్‌రెడ్డి, బీఆర్ఎస్ యూత్ నాయకుడు వీరేందర్ పాల్గొన్నారు.