పర్వతగిరి/కాజీపేట, ఏప్రిల్ 19 : చలో వరంగల్‌కు లక్షలాదిగా తరలివెళ్లి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శ్రేణులకు పిలుపునిచ్చారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగా, కేవలం 16 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు భరించలేక పోతున్నారన్నారు. శనివారం వరంగల్ జిల్లా పర్వతగిరిలోని తన ఇంటి ఆవరణలో నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
పరాయి పాలనలో గోసపడుతున్న తెలంగాణ ; మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
ఒక్కడిగా కేసీఆర్ 2001లో తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టి స్వరాష్ర్టాన్ని సాధించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. పర్వతగిరిలోని ఎర్రబెల్లి నివాసంతో పాటు గ్రేటర్ వరంగల్ 48, 61వ డివిజన్లలోని బాబుక్యాంప్, దర్గా కాజీపేట చౌరస్తాలో నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమ నాయకుడే సంక్షేమ సారథిగా ఉంటే రాష్ట్రం ఎలా వెలుగొందుతుందనే దానికి తెలంగాణ నిదర్శనంగా నిలిచిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అనాడు కేసీఆర్ పిడికెడు మందితో కలిసి టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్ని ఆటుపోట్లు, అవమానాలు ఎదురైనా ఎదురొడ్డి పోరాటం సాగించారన్నారు. తెలంగాణ సాధించాక అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ చేయడం ద్వారా రాష్ట్రంలో బీడువారిన పొలాలను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దకుతుందన్నారు.
‘నీళ్లు-నిధులు-నియామకాలు’ నినాదంతో కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న రాష్ట్రం ప్రస్తుతం పరాయి పాలనలో గోస పడుతున్నదని, తెలంగాణ ప్రజల హక్కుల సాధన, రక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యమనేత కేసీఆర్ 14 ఏండ్లు ఉద్యమాన్ని నడిపి, 2009లో చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించారన్నారు. తెచ్చుకున్న తెలంగాణను పదేళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. సమైక్యపాలన నాటి రోజులు మళ్లీ రాకుండా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి తెలంగాణను కాపాడుకోవాలని వినోద్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, పర్వతగిరి మండలాధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, 48, 61 డివిజన్ల పార్టీ అధ్యక్షులు కోటిలింగం, హరినాథ్, పర్వతగిరి మండల ఇన్చార్జి చింతల యాదగిరి, పీఏసీఎస్ అధ్యక్షుడు మనోజ్‌కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, నాయకులు పత్తి సంపత్, కుమ్మరి సాంబయ్య, చింతపట్ల సోమేశ్వర్రావు, బోయినపల్లి యుగంధర్‌రావు, చిన్నపాక శ్రీనివాస్, మాడుగుల రాజు, దేవేందర్, బొట్ల భాసర్, నాగుల బాబు, చీదురు తిరుపతి, నరేశ్, రంగు కుమార్ తదితరులు పాల్గొన్నారు.