హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం అవుదామని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. దశాబ్దాల కాల రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణను సాకారం చేసుకున్నామన్నారు.
ఆత్మాభిమానం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను శాంతియుతంగా సాధించటంలో మహనీయుల స్ఫూర్తి మరువలేమన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిందన్నారు. మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కే.జయశంకర్ భూమిక మనకు గర్వకారణం అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ రైజింగ్ తెలంగాణకు అందరి తోడ్పాటు అవసరం అన్నారు. అంతకు ముందు జాతీయ పతకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య బి.సురేష్ లాల్, డాక్టర్ బి.రమ, డాక్టర్ చిర్రా రాజు, అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.