అంబర్‌పేట, జూన్ 8:సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించా రు. ఈ కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ రక్షిత కే మూర్తి, అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య వెల్లడించారు. తూకారాంగేట్ రైల్వేబ్రిడ్జి వద్ద గుర్తు తెలియని శవం పడి ఉందని జూన్ 3వ తేదీన ఉదయం లాలాగూడ పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి చనిపోయి ఉండడం గమనించారు.
తలపై రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలంలో మద్యం సీసా, బ్యాగ్ లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకొని హత్యకు గురైన వ్యక్తి గుర్తింపు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూడు రోజుల తర్వాత మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన జైప్రకాష్ దేశ్‌ముఖ్(38)గా గుర్తించారు. హైదరాబాద్‌లో మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న అతను జూన్ 2వ తేదీన కాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి తన సోదరుడి వద్దకు వెళ్లే క్రమంలో హత్యకు గురయ్యాడు. మోం డా మార్కెట్ ప్రాంతంలో జైప్రకాశ్ దేశ్‌ముఖ్‌కు గ్రాసరీ డెలివరీ చేసే తుకారాంగేట్‌కు చెందిన దాబీ వినోద్(30), స్విగ్గీ డెలివరీ చేసే అడ్డగుట్టకు చెందిన మక్కల మోహన్(19) పరిచయమయ్యారు.
అతన్ని రైల్వేస్టేషన్ వద్ద దింపుతామని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి డబ్బు, మొబైల్ ఫోన్ దోచుకునే ప్రయత్నంలో మృతుడు ప్రతిఘటించడంతో పెద్ద రాళ్లతో తలపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం రూ.110 నగదు, మొబైల్ ఫోన్ దోచుకుని పరారయ్యారు. సీసీటీవీ పుటేజీ లు, సాంకేతిక ఆధారాలతో ఈనెల 8న ఇద్ద రు నిందితులను అరెస్టు చేశారు. దాభే వినోద్‌పై గతంలోనూ క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో చిలకలగూడ ఏసీపీ కె.శశాంత్రెడ్డి, ఇన్స్పెక్టర్ టి.అశోక్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, డీఐ మధుబాబులు పాల్గొన్నారు.