పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 26 : వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని లీగల్ మెట్రాలజీ (తూనికలు, కొలత లు) కార్యాలయాలు ఇన్చార్జీలమయమయ్యాయి. పాత వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్ర ధాన కార్యాలయంగా వరంగల్‌లో ఉన్న రీజినల్ డిప్యూటీ కంట్రోలర్ పోస్టు సైతం ఐదేళ్లుగా ఇన్‌చార్జీలతోనే కొనసాగుతున్నది. అలాగే కొత్త జిల్లాల్లో కూడా చాలా వరకు రె గ్యులర్ అధికారులు, ఇన్స్పెక్టర్లు లేకపోవడం విస్మయాని కి గురిచేస్తున్నది.
దీంతో పర్యవేక్షణ కరువై వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, వినియోగదారులను మో సం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జిలుగా ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం, వ్యాపారుల నుంచి మామూ ళ్లు స్వీకరిస్తూ దాడులు చేయకపోవడంతో వినియోగదారులు మోసపోతున్నారని వినియోగదారుల మండలి స భ్యులు ఆరోపిస్తున్నారు. మరోపక్క కార్యాలయంలో ఉన్న మూడు వాహనాలను అధికారులు వాడకపోవడం వల్ల అవి నిరూపయోగంగా మారుతున్నాయి. వరంగల్‌లో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించి మూడు కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇం దులో పాత జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌కు సంబంధించి రీజినల్ డిప్యూటీ కంట్రోలర్ కార్యాలయం వరంగల్‌లో ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం న ల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్ సిద్ధార్థకుమార్ ఇన్చార్జి డిప్యూటీ కంట్రోల్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. అయితే సదరు అధికారి మూడు రోజులు నల్లగొండ, మహబూబ్‌నగర్, మరో మూడు రోజులు వరంగల్‌లో ఉంటూ పాత మూడు ఉమ్మడి జిల్లాల బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక వరంగల్‌లోని అసిస్టెంట్ కంట్రోలర్‌గా ఉన్న రాజేశ్వర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ కంట్రోలర్ అడ్మిన్‌గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన ఎక్కువ శాతం హైదరాబాద్‌లోని హెడ్ ఆఫీసులోనే ఉం టూ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటారు. అత్యవసరమున్న ఫైళ్లను హైదరాబాద్‌కే తెప్పించుకునే పరిస్థితి నెలకొంది. అలాగే జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్‌గా ఉన్న ప్రవీణ్ గత నెలలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో ఇక్కడ జగిత్యాలకు చెందిన డీఎల్ఎంవో అజీజ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
వరంగల్‌ల్లోని ప్రధాన కార్యాలయంతో పాటు మిగిలిన జిల్లాల్లో సైతం ఇన్‌చార్జీలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం హనుమకొండకు జయశంకర్ భూపాలపల్లికి చెందిన డీఎల్ఎంవో శ్రీలక్ష్మి ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. ములుగుకు కూడా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. జనగామ జిల్లాకు నల్లగొండకు చెందిన శ్రీనివాసరావు ఇన్చార్జిగా కొనసాగుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాకు రెగ్యులర్ డీఎల్ఎంవోగా వినయ్‌కుమార్ ఉన్నప్పటికీ అతను ఖమ్మం ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. మధిర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కొత్తగూడెం డీఎల్ఎంవో మనోహర్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో కరీనంగర్, సిరిసిల్ల, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల కూడా విధుల్లో ఇన్‌చార్జీలే ఉంటున్నారు. మూడు నెలలుగా వీరి పర్యవేక్షణ లేక పలు వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంక్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.