ఖిలావరంగల్ : ఇరాన్, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ దురహంకార దాడులను ఖండించాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గ్రేటర్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు. ఇరాన్ దేశంపై అమెరికా సామ్రాజ్యవాద దత్తపుత్రుడు ఇజ్రాయిల్ చేస్తున్న దురహంకార దాడులకు వ్యతిరేకంగా రాష్ర్ట వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ధర్నా చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇజ్రాయిల్ ఇరాన్ దేశంపై వైమానిక క్షిపణి దాడులతో ప్రభుత్వ అధికారులను, ప్రజలను, శాస్త్రవేత్తలను చంపుతుందన్నారు. అమెరికా సామ్రాజ్యవాది ట్రంప్ కనుసన్నలలోనే జరుగుతుందన్నారు. 55,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలను హత్య చేసిందని, వారు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ దేశాలు పశ్చిమ ఆసియాలోని అరబ్బు దేశాలపై ఆధిపత్యం కోసమే యుద్ధాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్, సీపీఎం నాయకులు వల్లందాస్ దుర్గయ్య, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి యాదగిరి, బైరబోయిన ఐలయ్య, వల్లందాస్ కుమార్, చిర్ర సూరి, మధు, గన్నారపు రమేష్, ఐతం నగేష్, సంఘీ ఎలేందర్, ఆరూరి కుమార్, ఇనుముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.