చేతికొచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టడం రైతులకు ఏటా సవాలుగా మారుతున్నది. వానకాలం వరి కోతల సమయంలోనైతే ఈ సమస్య ఎక్కువగా ఉంటున్నది. నిత్యం ఎండబోసుడు, దగ్గర పోయడానికి ఎక్కువ సమయం పడుతున్నది. ఇక రోడ్లపై ఆరబోస్తే ప్రమాదాలు జరిగి, పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా ధాన్యాన్ని గంటల వ్యవధిలోనే ఆరబెట్టే మిషన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్యాడి డ్రయ్యర్ యంత్రంతో రైతులు గంటన్నర సమయంలో 25 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆరబెట్టి నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు.
– హనుమకొండ సబర్బన్, నవంబర్ 3
ఇటీవల కాలంలో యూట్యూబ్ వ్యవసాయానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది. రైతులు దీని ద్వారా అనేక నూతన వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని అవలంబిస్తున్నారు. ఈ క్రమంలోనే హసన్‌పర్తి మండలం సుబ్బయ్యపల్లికి చెందిన రైతు అవిర్నేని వేణు యూట్యూబ్ ద్వారా ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రం గురించి తెలుసుకున్నాడు. వెంట నే పంజాబ్ రాష్ర్టానికి వెళ్లి దాన్ని పరిశీలించి రూ.10 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు.
దీని ట్యాంకును ఒకసారి నింపితే 45 బస్తాల వరకు(25 క్వింటాళ్లు) గంటన్నర సమయంలో 30 శాతం వరకు ఉన్న తేమ 11 శాతానికి వస్తుంది. 225 సార్స్ పవర్ గల మిషన్ బర్నర్ సహాయంతో 80 డిగ్రీ సెల్సియస్ వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో ధాన్యం తొందరగా ఆరిపోయి మనకు కావాల్సిన తేమ శాతంతో బయటకు వస్తుంది. దీన్ని తీసుకొచ్చిన కొత్తలో మిషన్‌లో వడ్లను కూలీలు పోస్తేనే ఆరబెట్టే వీలు ఉండేది. ఈ సమస్యను అధిగమించడానికి వేణు గుజరాత్‌కు వెళ్లి ప్రత్యేకంగా స్క్రూ కన్వేయర్ అనే పరికరాన్ని తీసుకొచ్చి దీనికి అమర్చాడు. దీంతో కుప్ప పోసి ఉన్న వడ్లను అదే లోపలికి లాక్కొని ట్యాంకులోకి పంపుతుంది.
మిషన్‌లో వడ్లను పోసిన తర్వాత ప్రతి గింజ నాలుగు సార్లు ట్యాంకులో రొటేట్ అవుతుంది. దీంతో ట్యాంకు నుంచి తాలు వడ్లు ఒకవైపు నుంచి, దుమ్ము ధూళి మరోవైపు నుంచి బయటకు వెళ్లిపోతాయి. దీంతో గింజలు షైనింగ్‌తో కనబడతాయి. సహజ పద్ధతిలో ఆరబెట్టకుండా ఈ మిషన్ ద్వారా ఆరబెడితే జర్మినేషన్ సమస్య వస్తుందనే సందేహాలు నెలకొన్న నేపథ్యంలో పలు కంపెనీల ప్రతినిధులు దీని ద్వారా ఎండ బెట్టిన గింజలను పరీక్షించగా మొలకలు కూడా బాగానే వచ్చాయి. దీంతో రైతులు ఈ మిషన్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్యాడి డ్రయ్యర్‌తో 24 గంటల పాటు పని చేసుకునే వీలుంటుంది. 25 క్వింటాళ్ల వడ్లు ఎండబెట్టేందుకు రూ.2800 వరకు చార్జ్ చేస్తున్నారు.
కోతల సీజన్లో వడ్లను ఆరబెట్టేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా ఆ కష్టాలు అనుభవించాను. అనుకోకుండా యూట్యూబ్‌లో ప్యాడి డ్రయ్యర్ చూశాను. దీని కోసం పంజాబ్ రాష్ర్టానికి వెళ్లి డెమో చూసి కొన్నా. రైతులు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు. దీని వల్ల కూలీల ఖర్చుతగ్గడంతో పాటు తొందరగా ధాన్యం అమ్ముకునే వీలుంటుంది.
– అవిర్నేని వేణు, డ్రయ్యర్ యజమాని