తొర్రూరు, నవంబర్ 18 : కరువుతో నెర్రెలు బారిన నేలను సస్యశామలం చేసి బీడు భూములకు సాగునీరందించిన ఈ ప్రాంతాన్ని కోనసీమలా మార్చిన సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్య ర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో వందల కోట్ల నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తనను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తొర్రూరు మండలం గుడిబండ తండా, నాంచారిమడూర్, పెద్దమంగ్యాతండా, టీ క్యాతండా, వెంకటాపురం, అమర్సింగ్తండా, దుబ్బతండా, హరిపిరాల, కర్కాల గ్రామాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు. ఒకప్పుడు కరువుతో అల్లాడే ఈ ప్రాంతం నేడు జలకళతో పచ్చటి పైర్లతో కళకళలాడుతోందని, దీనికి సీఎం కేసీఆర్ కారణం కాదా ఆలోచించాలన్నారు. కాళేశ్వరం, దేవాదుల ద్వా రా వచ్చే నీటితో పాలకుర్తి నియోజకవర్గంలో లక్షా 15 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని, వేసవిలో కూడా చెరువులు నిండి మత్తళ్లు పోస్తున్నాయని తెలిపారు. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేయడంతో పాటు రైతు పండించిన ధాన్యాన్ని, మక్కలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని ఎర్రబెల్లి తెలిపారు. ఒక మోటర్‌కు ఏటా కనీసం లక్ష రూపాయల విద్యుత్ బిల్లు వస్తుందని, ఇదంతా ప్రభుత్వానికి భారమైనా రైతులకు న్యాయం చే యాలని సీఎం కేసీఆర్ వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారని చె ప్పారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలను ప్రజలు నమ్మొద్దని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్‌కు మించి రాదని ఆయన వివరించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, స్టడీమెటీరిల్ పంపిణీ, కరోనా కాలంలో ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, నిత్యావసర సరుకులు, ఆనందయ్య మందు అందజేసినట్లు గుర్తు చేశారు. ఎంతో మంది బాధితులకు నేరుగా ఆసుపత్రుల్లో సహాయం అందించానన్నారు. కానీ ఈ ప్రాంతానికి ఎంతో చేశానని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు కరోనా కాలంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. యువతకు, అవసరార్థుల కోసం కోట్లు వెచ్చించి డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఉపాధి కూలీలకు కిట్లు అందజేశామన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలని ఊరూరా కుట్టు శిక్షణ ఇప్పించి ఉచితంగా మిషన్లు అందజేయడమే కాకుండా వరంగల్ టెక్స్టైల్ పార్క్‌లో ప్రతిభ ఆధారంగా రూ.15 వేల వరకు సమకూర్చుకునేలా వందలాది ఉద్యోగాలు కల్పించబోతున్నామని ఆయన తెలిపారు. గ్రామాల్లో కోతుల బాధ లేకుండా కార్యాచరణ చేపట్టామన్నారు. కష్టకాలంలో మీ వెంట ఉన్న దయన్నను కాపాడతారా.. లేదంటే ఆమెరికా నుంచి సూట్ కేసుల్లో డబ్బులు తెచ్చి ఓట్లు కొనాలని చూస్తున్న కాంగ్రెస్ వాళ్లని కాపాడతారా..? మీరే ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. కేవలం ఎన్నికలప్పుడు వచ్చి తర్వాత వెళ్లిపోయే వలస పక్షులను పట్టించుకోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఊరూరికి సాగు నీరు, ఇంటింటికీ తాగునీరు అందించేలా కృషి చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావును ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్‌ను నమ్మొద్దన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పేదలందరికీ వ్యక్తిగత బీమాతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15 లక్షల వరకు వైద్య చికిత్స అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని సుధాకర్‌రావు తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తొర్రూరు పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు మద్దతు తెలిపారు. శనివారం స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో దయాకర్‌రావును కలిసి ఈ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.